
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) యూపీఐ లావాదేవీల కోసం ప్రస్తుతం ఉన్న పిన్ స్థానంలో బయోమెట్రిక్, ఫేస్‌ఐడీ ఆధారిత ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని పరిశీలిస్తున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఇది అమల్లోకి వస్తే డిజిటల్ లావాదేవీలు జరిపే సమయంలో యూజర్లు తమ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం బయోమెట్రిక్(ఫింగర్‌ప్రింట్) లేదా ఫేస్ ఐడీని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వ యంత్రాంగం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని గమనించాలి.
ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు చేసేందుకు 4 నుంచి 6 అంకెల పిన్ అవసరం. చెల్లింపులు చేసినప్పుడు కచ్చితంగా వినియోగదారులు ఈ పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్ పేమెంట్ గేట్‌వేకు సెక్యూరిటీ లేయర్‌గా పనిచేస్తుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం సౌకర్యవంతంగా లేని వ్యక్తులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు లేదా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇది ఎంటర్ చేయడం అడ్డంకిగా మారుతుంది. దాంతో కొత్త విధానాన్ని ఉపయోగించాలని ఎన్‌పీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా బయోమెట్రిక్ అథెంటికేషన్‌తో లేదా ముఖ గుర్తింపు వంటి భౌతిక లక్షణాల ద్వారా యూజర్‌ను ధ్రువీకరించే ప్రక్రియను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: భారత్‌లో స్టార్‌లింక్ సబ్‌స్క్రిప్షన్ ఎంతంటే..
ఈ చర్య పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడేవారికి బయోమెట్రిక్, ఫేస్‌ఐడీ ఆమోదంతో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయవచ్చని ప్లూటోస్ వన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ పార్టనర్ రోహిత్ మహాజన్ ఎకనామిక్ టైమ్స్‌కు చెప్పారు. ఇది డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడానికి, వీటిని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుందన్నారు. అదే సమయంలో బయోమెట్రిక్ వ్యవస్థలు మోసాలను కూడా తగ్గిస్తాయని చెప్పారు. పిన్ ఎంటర్ చేయడంతో పోలిస్తే వినియోగదారుల భౌతిక లక్షణాలు డూప్లికేట్ చేయడం లేదా దొంగిలించడం కష్టమన్నారు.