‘ఎక్స్’ స‌మాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Cant Believe X Information Said Jimmy Wales - Sakshi

టెక్‌ కంపెనీల మధ్య నిత్యం పోటీ ఉంటుంది. వినియోగదారులకు అందించే సేవలతో పాటు ఇతర విషయాల్లో ఆ సంస్థల యజమానుల్లో ఆ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా వికీపిడియా సహవ్యవస్థాపకుడు జిమ్మీవేల్స్‌ ఎలాన్‌మస్క్‌ సార‌ధ్యంలోని ఎక్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాట్‌జీపీటీ, బింగ్‌, బార్డ్ వంటి చాట్‌బాట్స్ ఆధారిత లార్జ్ ల్యాంగ్వేజ్ మోడ‌ల్స్ (ఎల్ఎల్ఎం) వికీపిడియా డేటాను ఉపయోగిస్తున్నాయని, మ‌స్క్ ఆధ్వర్యంలోని ఎక్స్‌ డేటాను కాద‌ని జిమ్మీ వేల్స్ అన్నారు. 

పోర్చుగల్‌లోని లిస్బన్‌లో జరిగిన వెబ్ సమ్మిట్‌లో జిమ్మీ వేల్స్ మాట్లాడారు. ఎలాన్‌మ‌స్క్‌, ఆయ‌న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. స‌రైన స‌మాచారానికి ఎక్స్ నమ్మదగిన వేదిక కాద‌న్నారు. ట్విట్ట‌ర్‌కు (ఎక్స్‌) బ‌దులు ఎల్ఎల్ఎంలు వికీపిడియా డేటాను వినియోగించడం ప‌ట్ల గర్వంగా ఉందన్నారు.

ఎక్స్ ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్‌లో భాగంగా మ‌స్క్‌ ఆఫ‌ర్ చేస్తున్న ఏఐ చాట్‌బాట్ గ్రోక్ గురించి తానిప్ప‌టివ‌ర‌కూ విన‌లేద‌ని వేల్స్ చెప్పారు. మరోవైపు ఎల‌న్ మ‌స్క్ ఇటీవ‌ల వికీపిడియాపై చేసిన వ్యాఖ్య‌లపై డిబేట్ సాగింది. వికీపీడియా త‌న వెబ్‌సైట్ పేరును డికీపీడియాగా మార్చుకోవాల‌ని మస్క్ సూచించారు. త‌న సూచ‌న‌కు అనుగుణంగా వారు పేరు మారిస్తే ఆ వెబ్‌సైట్‌కు మిలియ‌న్ డాల‌ర్లు ఇస్తాన‌ని మ‌స్క్ వ్యాఖ్యానించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top