కెనడా వెళ్లే విద్యార్థులకు మరో షాక్‌! ఇకపై అలా కుదరకపోవచ్చు.. | Sakshi
Sakshi News home page

కెనడా వెళ్లే విద్యార్థులకు మరో షాక్‌! ఇకపై అలా కుదరకపోవచ్చు..

Published Mon, Dec 25 2023 9:28 PM

Canada likely to restrict temporary foreign workers entry in 2024 - Sakshi

కెనడా వెళ్లే విద్యార్థులకు ఆ దేశం మరో షాక్‌ ఇవ్వబోతోంది. 2024 ఆ తర్వాత దేశంలోకి తాత్కాలిక విదేశీ ఉద్యోగుల ప్రవేశంపై పరిమితులు విధించే అవకాశం ఉందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తెలిపారు. తాత్కాలిక విదేశీ ఉద్యోగుల భారీ ప్రవాహాన్ని పరిష్కరించడానికి వచ్చే ఏడాది ప్రారంభంలో పలు సంస్కరణలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కెనడాలో తలెత్తిన హౌసింగ్‌ సంక్షోభానికి విదేశీ విద్యార్థులు, తాత్కాలిక విదేశీ కార్మికులు పెద్ద సంఖ్యలో రావడానికి మధ్య సంబంధం ఉందని మిల్లర్ అభిపాయపడ్డారు. తాత్కాలిక ప్రాతిపదికన కెనడాలోకి ప్రవేశించిన వారి సంఖ్య ఆకాశాన్ని తాకిందన్నారు. అయితే తాను నిర్దిష్టంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం లేదని చెప్పారు.

విద్యార్థుల రూపంలో..
దేశంలో చాలా కాలంగా అస్థిరంగా ఉన్న తాత్కాలిక విదేశీ కార్మిక వ్యవస్థ వల్ల తలెత్తుతున్న పరిణామాలపై తాను దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు మిల్లర్ పేర్కొన్నారు. తాత్కాలిక వ్యవసాయ కార్మికులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్‌లను పొందిన అంతర్జాతీయ విద్యార్థుల రూపంలో తాత్కాలిక విదేశీ కార్మికులు కెనడాలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు.

పెరుగుతున్న జనాభా
కెనడాలో జనాభా క్రమంగా పెరుగుతోంది. 2023 మూడో త్రైమాసికంలో ఆ దేశ జనాభా 4.3 లక్షలకుపైగా పెరిగిందని స్టాటిస్టిక్స్ కెనడా తన ఇటీవలి డేటాలో పేర్కొంది. ఇది వెల్లడైన వారం రోజుల్లోనే మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో 1957 తర్వాత ఓ త్రైమాసికంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు ఇదే. ఈ నివేదిక ప్రకారం.. కెనడాలో ప్రస్తుతం 4 కోట్లకుపైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 3.13 లక్షల మంది వలసదారులు ఉండటం గమనార్హం.

కాగా విదేశీ విద్యార్థుల పట్ల కెనడా ప్రభుత్వం ఇదివరకే కఠిన నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి కెనడాలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధుల డిపాజిట్‌ మొత్తాన్ని భారీగా పెంచింది. ప్రస్తుతం ఆ మొత్తం 10వేల డాలర్లు (రూ.6.14లక్షలు) ఉండగా దాన్ని ట్రూడో ప్రభుత్వ 20,635 డాలర్లు (రూ.12.7లక్షల)కు పెంచింది.  2024 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. 

Advertisement
 
Advertisement