
బీఎస్‌ఈ ఇండెక్స్ సర్వీసెస్ విభాగం తాజాగా డిఫెన్స్ ఇండెక్స్‌ను ప్రారంభించింది. బీఎస్‌ఈ 1000 ఇండెక్స్‌లోని డిఫెన్స్ థీమ్ స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి. ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్‌లో) ఇండెక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తారు. విధాన సంస్కరణలు, పెరుగుతున్న బడ్జెట్ కేటాయింపులు, దేశీయంగా తయారీపై మరింతగా దృష్టి పెరుగుతుండటం తదితర సానుకూల అంశాలతో డిఫెన్స్ రంగం గణనీయంగా వృద్ధి చెందనుందని బీఎస్‌ఈ ఇండెక్స్ సర్వీసెస్ వివరించింది.
ఈ నేపథ్యంలో ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ మొదలైన ప్యాసివ్ ఫండ్స్‌కి ఇండెక్స్ ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. అలాగే, పీఎంఎస్ వ్యూహాలు, మ్యుచువల్ ఫండ్ స్కీములు, ఫండ్ పోర్ట్‌ఫోలియోల పనితీరు మదింపునకు దీన్ని ప్రామాణికంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.