
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారతదేశంలోని తన మొత్తం వాహనాల ధరలను 2025 సెప్టెంబర్ 1 నుంచి 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. నిరంతర విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గులు & ప్రపంచ సరఫరా గొలుసు ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
భారతదేశంలో బీఎండబ్ల్యూ లగ్జరీ సెడాన్‌లను, ఎస్‌యూవీలను, ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఇందులో రూ. 46.9 లక్షల ధర కలిగిన 2 సిరీస్ గ్రాన్ కూపే నుంచి రూ. 2.6 కోట్ల ధర కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ వరకు ఉన్నాయి.
ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో కంపెనీ అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే నిరంతర ఫారెక్స్ ప్రభావం.. ప్రపంచ సరఫరా గొలుసు డైనమిక్స్ వంటి అంశాలు మెటీరియల్ & లాజిస్టిక్స్ ఖర్చులను పెంచడానికి కారణమవుతున్నాయని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ 'విక్రమ్ పవా' పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ పండుగ సీజన్‌లో మరికొన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: ప్రపంచ ఆటోమొబైల్ రంగం: తిరుగులేని శక్తిగా భారత్
బీఎండబ్ల్యూ స్థానికంగా 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 7 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ వంటి మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. కాగా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, బీఎండబ్ల్యూ ఐఎక్స్, జెడ్4 ఎం40ఐ, ఎం కూపే వంటి కార్లను సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటోంది.