breaking news
September 1st
-
సెప్టెంబరు ఒకటి నుంచి బడులు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతినిస్తే విద్యా సంస్థల్లో వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి దశల వారీగా ప్రత్యక్ష బోధన విధానాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. తొలుత తొమ్మిది, పది, ఇంటర్మీడియెట్ తరగతులను పునః ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపింది. సీఎం సూచనల మేరకు విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకుని.. కోవిడ్ కారణంగా 2020 నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. మధ్యలో కొంతకాలం మినహా దాదాపు 18 నెలలుగా డిజిటల్ పద్ధతిలోనే బోధన జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా ప్రత్యక్ష బోధనకు అనుమతించాలని విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు కోవిడ్ తీవ్రత తగ్గిందని, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు సరైన వాతావరణం నెలకొందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. పలు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన ప్రారంభించాయి. ఆన్లైన్ పాఠాలు ఫలితాన్ని ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో కొందరు తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిశీలించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఒకేసారి ఓపెన్ చేస్తే ఇబ్బందులు.. ఒకటి నుంచి ఎనిమిది తరగతుల్లో ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై విద్యాశాఖ ఒకింత విముఖంగానే ఉంది. థర్డ్ వేవ్పై ఊహాగానాల నేపథ్యంలో ఈ దిశగా చర్యలు సరైనవి కావని అభిప్రాయపడుతోంది. చిన్న తరగతుల విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవడం కష్టమనే విషయంలో అధికారులు ఏకాభిప్రాయంతో ఉన్నారు. మరోవైపు అన్ని క్లాసులను ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల విద్యా సంస్థలు కిక్కిరిసే అవకాశాన్నీ గమనంలో ఉంచుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తొలుత 9, 10 తరగతులతో పాటు, ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి అనుమతులివ్వడం మేలని ప్రభుత్వానికి నివేదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని కింది తరగతులకు అనుమతులిస్తే శ్రేయస్కరమని భావిస్తున్నట్టు విద్యాశాఖ తెలిపింది. అవసరమైతే అదనపు సెక్షన్లు.. క్లాసుకు 30 మందికి మించకుండా ప్రత్యక్ష తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంతకు మించి విద్యార్థులు ఉండే అవకాశం లేదని, ఎటొచ్చీ ప్రైవేటు సంస్థలతోనే ఇబ్బందని పేర్కొంది. ప్రైవేటు సంస్థల విషయంలో సరైన పర్యవేక్షణ అవసరమని, ఈ మేరకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నివేదించింది. 30కి మించి విద్యార్థులు ఉంటే సెక్షన్లు పెంచేలా చూడాలని సూచించింది. ఈ నేపథ్యంలో పలు కార్పొరేట్ పాఠశాలల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా విద్యాశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ఒక గదిలో టీచర్ ప్రత్యక్ష బోధన చేసినప్పటికీ, మిగతా సెక్షన్లలో టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని కొన్ని సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి. సర్కారు దృష్టికి ‘ఆన్లైన్’ ఇబ్బందులు విద్యాశాఖ తాజా ప్రతిపాదనల మేరకు.. 1–8 తరగతుల విద్యార్థులకు మరికొంత కాలం ఆన్లైన్లోనే విద్యాబోధన జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు కొందరి నుంచి వ్యతిరేకత వస్తోందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో పిల్లలు ఎలక్ట్రానిక్ వస్తువులకు అలవాటు పడుతున్నారని, దీనివల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోందని ఆయన తెలిపారు. దీంతో ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికే అనధికారికంగా ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయని, కేవలం ప్రభుత్వ సంస్థల విద్యార్థులకే నష్టం జరుగుతోందని మరోఅధికారి చెప్పారు. ఏదేమైనా కోవిడ్ దృష్ట్యా చిన్న పిల్లల విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కన్పించడం లేదని అన్నారు. -
అవకాశాల కోసం అలా చేయను
చెన్నై: ఇతరుల కంటే వైరుధ్య భావాలు గల నటి నిత్యామీనన్ అని చెప్పవచ్చు. నటనే వృత్తిగా ఎంచుకున్న ఆమె అదే జీవితం కాదు అంటారు. అందుకే నిత్యను కొందరు పొగరుబోతు అంటారు. అయినా డోంట్ కేర్ అంటున్నారు ఈ కేరళాకుట్టి. మణిరత్నం చిత్రం ‘ఓ కాదల్ కణ్మణి’ చిత్రం వరకూ కోలీవుడ్లో అంతగా పేరులేని నాయకి నిత్యామీనన్. ఆ చిత్ర విజయం మంచి ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాదు అంతకు ముందు వరకూ చిన్న హీరోల సరసన నటించిన ఈ బ్యూటీకి ఆ తరువాత ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరుస కడుతుండడం గమనార్హం. పాత్ర నచ్చితే అది చిన్నదైనా నటించడానికి సిద్ధం అంటున్న నిత్యామీనన్ 24 చిత్రంలో సూర్య సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సుదీప్ సరసన ముడింజా ఇవన పుడి చిత్రంలో నటించిన నిత్యామీనన్ తాజాగా విక్రమ్కు జంటగా ఇరుమురుగన్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ అంటూ ప్రముఖ నాయకులతో నటించడం విశేషం. నిత్యామీనన్ సాధారణ పొడుగు కాస్త తక్కువే. దాన్ని కొరతగా చూపేవాళ్లూ లేక పోలేదు. అయితే దాన్ని ఒక అనర్హతగా తానెప్పుడూ భావించలేదంటారామె. ఇంతకు ముందు పొట్టి, లావు అని వంకలు పెట్టిన వారే ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకోవడంతో నిత్యామీనన్ మంచి నటి అని అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారని పేర్కొంది. మరికొందరు బరువు తగ్గి స్లిమ్ అయితే మరిన్ని అవకాశాలను రాబట్టుకోవచ్చునన్న ఉచిత సలహాలిస్తున్నారని, అవకాశాల కోసం నోరు కట్టుకోవలసిన అవసరం తనకు లేదని అన్నారు. ఇష్టమైన ఆహార పదార్థాలు తింటేనే నాకు సంతోషంగా ఉంటుందన్నారు. అప్పుడే ముఖం కాంతులీనుతుందని అన్నారు. ఆ అందం కంటే ఆహారంలో ఆంక్షలు విధించుకుని స్లిమ్ అయ్యి అరువు అందాలను కొనితెచ్చుకోవడం తనకు ఇష్టం లేదని నిత్యామీనన్ అంటున్నారు. తానింతే బొద్దుగా ముద్దుగా ఉంటానంటున్న ఈ భామ సమంతతో కలిసి జూనియర్ ఎన్టీఆర్తో నటించిన తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ సెప్టెంబర్ ఒకటో తారీఖున తెరపైకి రానుంది.