
బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఇండియన్ మార్కెట్లో తన జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ (BMW G 310 RR Limited Edition) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర స్టాండర్డ్ జీ 310 ఆర్ఆర్ కంటే కూడా రూ. 18000 తక్కువ. దీనిని 310 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే.. ఈ బైకును 310 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయగలరు.
భారతదేశంలో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ 1000 యూనిట్లు అమ్ముడైన సందర్భంగా.. కంపెనీ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పులు పొందలేదు. ఫ్యూయెల్ ట్యాంక్ మీద 1/310 బ్యాడ్జ్ ఉండటం చూడవచ్చు. ఇది రెండు బేస్ కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంది.
బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ 312 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 9700 rpm వద్ద 34 bhp పవర్, 7700 rpm వద్ద 27.3 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. రైడ్-బై-వైర్ త్రాటిల్, రైడింగ్ మోడ్స్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, కలర్ TFT డిస్ప్లే వంటివన్నీ ఈ బైకులో ఉన్నాయి.