
ఐపీవోకి స్టాక్ బ్రోకింగ్ దిగ్గజం గ్రో రెడీ
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
రూ. 8,500 కోట్ల సమీకరణపై కన్ను
కంపెనీ విలువ రూ. 60,000 కోట్లుగా అంచనా
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకింగ్ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ బిలియన్ డాలర్ల(రూ. 8,500 కోట్లు)వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రో బ్రాండుతో కంపెనీ రిటైల్ బ్రోకింగ్ సర్వీసులందించే సంగతి తెలిసిందే. ఐపీవోలో భాగంగా కొత్తగా ఈక్విటీ జారీసహా ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గ్రోలో ఇప్పటికే పీక్ ఎక్స్‌వీ, టైగర్ క్యాపిటల్, సత్య నాదెళ్ల(మైక్రోసాఫ్ట్ సీఈవో) తదితరులు ఇన్వెస్ట్ చేశారు. ఇష్యూ నిధులను టెక్నాలజీ డెవలప్‌మెంట్, వ్యాపార విస్తరణ తదితరాలకు వినియోగించనుంది.
2016లో ఏర్పాటైన కంపెనీ ప్రస్తుత విలువ 7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 60,000 కోట్లు)కు చేరుకున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. వేగంగా విస్తరించిన కంపెనీ 2025 మార్చికల్లా 26 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం గతేడాది(2024–25) 34 లక్షల మంది కొత్త కస్టమర్లను జత చేసుకుంది.
మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 95 లక్షల నుంచి 1.29 కోట్లకు ఎగసింది. 2023లో కంపెనీ టర్న్‌అరౌండ్ సాధించి రూ. 449 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 1,277 కోట్లను తాకింది. 2024కల్లా ఆదాయం రూ. 3,145 కోట్లకు ఎగసింది. రూ. 535 కోట్ల నిర్వహణ లాభం సాధించినప్పటికీ రూ. 1,340 కోట్ల వన్‌టైమ్ పన్ను చెల్లింపుల కారణంగా రూ. 805 కోట్ల నికర నష్టం ప్రకటించింది.