ఇన్‌స్టంట్ క్రెడిట్‌తో గుల్లవుతున్న ఇంటి బడ్జెట్
ఆదాయాన్ని మించిన ఈఎంఐలతో బెంబేలు
అత్యవసర రుణాలతో ఆర్థికంగా కుదేలు
ఒకటికి మించిన యాప్స్ నుంచి రుణాలు
తీర్చడానికి మరో చోట అప్పు చేస్తూ అవస్థలు
వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
రమేష్ నెలవేతనం రూ.12,000. కానీ, తను కట్టాల్సిన ఈఎంఐ రూ.46,700. మరి ఎలా చెల్లిస్తాడు? ఇదేమైనా సాధ్యమయ్యే పనేనా?
వాస్తవానికి రమేష్ ఏ నూటికో వెయ్యికో ఒక్క కేసు కాదు. తక్కువ, మధ్యాదాయ వర్గాల్లో ఇపుడు ఎక్కువ మంది ఇంచుమించు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. డిజిటలైజేషన్ వల్ల ఎన్నో లాభాలున్నట్లే నష్టాలూ ఉన్నాయి. వాటి ప్రతిఫలమే ఈ రుణాల ఊబి. ఎందుకంటే ఒకప్పుడు రుణాలు కావాలంటే సవాలక్ష డాక్యుమెంట్లు పట్టుకుని బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగితే తప్ప వచ్చేది కాదు.
ఇప్పుడైతే రుణ దాతలే ‘లోన్ కావాలా?’ అని ఫోన్లు చేసి అడగటమే కాక... మెయిల్స్, మెసేజీలతో హోరెత్తిస్తున్నారు. ఏదో ఒక బలహీన క్షణంలో అవసరాల్ని బేరీజు వేసుకోకుండా ఓకే బటన్ నొక్కేస్తే చాలు. నిమిషాల్లోనే కోరుకున్నంత రుణం బ్యాంక్ ఖాతాలలో వచ్చిపడుతోంది. తీర్చే స్థోమత ఉందా? లేదా అన్న పట్టింపు కూడా ఈ డిజిటల్ రుణదాతలకు అవసరం లేదు. పాన్, ఆధార్ ఇస్తే చాలు.
నిమిషాల్లో రుణ దరఖాస్తును డిజిటల్‌గా ప్రాసెస్ చేసి, రుణం మంజూరు చేసేస్తున్నాయి. దీంతో ఒకే వ్యక్తి పలు యాప్‌ల నుంచి రుణం తీసుకోవటం సాధ్యమవుతోంది. తీరా కట్సాల్సి వచ్చినప్పుడే అసలు నొప్పి తెలుస్తోంది. ఆర్‌బీఐ ఇప్పటికే కఠిన నియంత్రణలు తెచ్చినా... ఈ రుణ యాప్స్ విపరీత మార్కెటింగ్‌కు తెరపడడం లేదు. ఇచ్చే వాడు ఏదో మార్గంలో ముక్కు పిండి వసూలు చేసుకుంటాడు. కాకపోతే తీసుకునే వారే విచక్షణతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది.
ఎన్నెన్నో ఉదంతాలు..
→ ఓ కాంట్రాక్టు కార్మికుడు 13 మంది సభ్యుల కుటుంబానికి ఏకైక ఆధారం. వైద్య అత్యవసర పరిస్థితుల్లో మార్గం తోచక.. ఆరు డిజిటల్ లోన్ యాప్స్ నుంచి అందినంత రుణం పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆదాయానికి నాలుగు రెట్లు అధికంగా ఈఎంఐ కట్టలేక లబోదిబోమంటున్నాడు.
→ మానవ వనరుల విభాగంలో పనిచేసే ఒక ఎగ్జిక్యూటివ్ నెలసరి వేతనం రూ.25,000. 14 యాప్స్ నుంచి తీసుకున్న రుణాలు రూ.20 లక్షలు దాటేశాయి.
→ ఒక డ్రైవర్ నెలవారీ రూ.40,000 సంపాదిస్తున్నాడు. కానీ, అతడు తీర్చాల్సిన అప్పడు రూ.17 లక్షలు. ఐదు సంస్థల నుంచి ఈ రుణం తీసుకున్నాడు.
→ ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ అయితే ఒకదాని తర్వాత ఒకటి చొప్పున 20 సంస్థల నుంచి ఏకంగా రూ.37 లక్షల రుణాలు వాడేసుకున్నాడు. బ్యాంక్‌లు, ఫైనాన్స్ సంస్థలు, డిజిటల్ లోన్ యాప్స్ ఇలా ఏ ఆఫర్‌నూ అతడు వదల్లేదు.
→ ఒక కంపెనీకి మేనేజర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా సంఘటిత, అసంఘటిత సంస్థల నుంచి రూ.1.14 కోట్ల రుణ సాయాన్ని తీసుకున్నాడు.
→ నేడు ఈ తరహా రుణమిచ్చే, పుచ్చుకునే సంస్కృతి బలంగా విస్తరిస్తుండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
తెలియకుండానే ట్రాప్‌లోకి..
→ అత్యవసర వైద్యం, స్కూల్ ఫీజు చెల్లించాల్సిన గడువు సమీపించడం, ఇంటి అద్దె, క్రెడిట్ కార్డు బకాయి గడువు మించిపోతుండడం, చివరికి స్టాక్ మార్కెట్లో నష్టాల నుంచి బయటపడేందుకు సైతం యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
→ సంప్రదాయ బ్యాంక్‌లు, టాప్ టైర్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) రుణ దరఖాస్తులను ఆసాంతం విశ్లేషించిన తర్వాతే రుణ మంజూరును నిర్ణయిస్తుంటాయి.
→ కానీ, నడమంత్రపు సిరిని కోరుకుంటున్న లోన్ యాప్స్ మాత్రం సంప్రదాయ రక్షణ విధానాలను బైపాస్ చేస్తూ చిటికెలో రుణాలకు ఒకే చెబుతున్నాయి. తద్వారా మార్కెట్ విస్తరణే వాటి వ్యాపార మంత్రంగా మారిపోయింది.
→ పాన్ నంబర్‌తో ఎలాంటి తనఖా అవసరం లేకుండానే ఐదు నిమిషాల్లోపే రుణ మొత్తాన్ని మంజూరు చేస్తున్నాయి.
→ దీంతో అవసరంలో ఉన్న వారు, మరో మార్గం లేదన్నట్టు మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా శక్తికి మించి రుణాలను తీసుకుంటున్నారు.
→ తొలుత రూ.1,000 లేదా రూ.5,000తో మొదలైనా.. చివరికి రూ.లక్షలకు ఇది విస్తరిస్తోంది.
చార్జీలతో బాదుడే బాదుడు
→ ఈ తరహా రుణాలకు అలవాటు పడ్డవారు ఇక ఆ సుడిగుండం నుంచి బయటపడడం కష్టమే. ఎందుకంటే ఇవి వసూలు చేసే చార్జీలు ఆ స్థాయిలో ఉంటున్నాయి.
→ ప్రాసెసింగ్ ఫీజు, ప్లాట్‌ఫారమ్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజు, జీఎస్‌టీ, స్టాంప్ డ్యూటీ ఇలా రకరకాల చార్జీలు లోన్ యాప్స్‌కు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటాయి.
→ సాధారణంగా ఈ రుణాలను 30 రోజుల్లోపే తీర్చేయాల్సి ఉంటుంది. లేదంటే రుణగ్రహీత కోలుకులేనంతగా మరిన్ని చార్జీల బాదుడు మొదలవుతుంది. ఈ బాదుడు నుంచి బయటపడేందుకు రుణదాతలు మరో యాప్ తలుపు తట్టి అప్పటికి గట్టెక్కేసే మార్గం వెతుక్కుంటున్నారు.
అడ్డదారులు.. అడ్డగోలు విధానాలు
→ ఆర్‌బీఐ పర్యవేక్షణలోని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలే రుణాలను మంజూరు చేయాల్సి ఉంటుంది. కనీసం పేమెంట్‌బ్యాంక్‌లు సైతం రుణాలివ్వడానికి లేదు.
→ కానీ, ఈ నిబంధనలను ఫిన్‌టెక్ కంపెనీలు బైపాస్ చేస్తున్నాయి. తాము నేరుగా రుణాలివ్వకుండా మధ్యవర్తిత్వంతో రుణగ్రహీతలపై దండెత్తుతున్నాయి.
→ ఒక యాప్ లేదా ఫిన్‌టెక్ ఒకటికి మించిన ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంక్‌లతో టైఅప్ పెట్టుకుని, వాటి తరఫున రుణ వేదికగా మారుతోంది.
→ కస్టమర్లను ఆకర్షించడం, డేటాను విశ్లేషించడం, రుణం మంజూరు చేయించడం, దాన్ని వసూలు చేయడం తదితర పనులు చేస్తున్నాయి.
→ అసలు రుణం మంజూరు చేసేది బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ అయితే.. మిగిలిన పనులన్నింటినీ ఇవి కానిచ్చేస్తున్నాయి. ఆర్‌బీఐ పర్యవేక్షణకు దూరంగా వ్యాపార వృద్ధి కోసం దూకుడుగా వ్యవహరించడం వీటి వంతు.
→ ఆర్‌బీఐ పర్యవేక్షణలోని బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో నేరుగా సంప్రదింపుల్లేకపోవడంతో రుణ గ్రహీత హక్కులకు రక్షణ లేకుండా పోతోంది. వారు బాధితులుగా మారుతున్నారు.
→ రూ.25,000 సంపాదించే వ్యక్తికి రూ.20 లక్షల రుణం ఎక్కడి నుంచి వస్తోంది? డెలివరీ సేవలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే వ్యక్తికి రూ.37 లక్షల రుణాలను యాప్స్ ఎలా మంజూరు చేస్తున్నాయి?
→ రుణ గ్రహీత పాన్ నంబర్ ఆధారంగా రుణ చరిత్రను సమగ్రంగా పరిశీలించి కదా అర్హతను తేల్చాలి? కానీ వాస్తవంలో ఇవేవీ లేకుండా ఒకటికి మించిన యాప్‌లు ఎడాపెడా రుణాలను ఇచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఎలా వసూలు చేసుకోవాలో వాటికి తెలుసు గనుక.
బాదుడు ఇలా..
రుణం మొత్తం రూ.10,000
ప్రాసెసింగ్ ఫీజు రూ.800
ప్లాట్‌ఫారమ్ చార్జీలు రూ.300
చేతికి వచ్చేది రూ.8900
14 రోజుల తర్వాత చెల్లించాల్సిన మొత్తం రూ.10,500
→ చాలా రుణ యాప్స్ 30–40 శాతం వడ్డీ అంటూ ఊదరగొడుతుంటాయి.
→ కానీ, వాస్తవంగా రోజుకు 1% చొప్పున వసూలు చేస్తుంటాయి. అంటే వార్షిక వడ్డీ 365%.
→ ఈ ప్రకారం.. రూ.10,000 రుణానికి వారంలో రూ.10,700 చెల్లించాల్సి ఉంటుంది.
→ పెనాల్టీలు, ఆలస్యపు రుసుములు అదనం.
→ రూ.10,000 రుణానికి రూ.500 (10 శాతం) ప్రాసెసింగ్ ఫీజుగా తీసుకుంటున్నవీ ఉన్నాయి.
ఎంతో వ్యత్యాసం
రుణం రకం వార్షిక వడ్డీ రేటు(%)
గృహ రుణం 8–10
వ్యక్తిగత రుణం 12–18
క్రెడిట్ కార్డు 36–42
డిజిటల్ లోన్ యాప్స్ 60– 365
నట్లు బిగిస్తున్న ఆర్‌బీఐ
→ రుణ యాప్స్ అడ్డగోలు వ్యవహారాలు తెలియడంతో ఆర్‌బీఐ నిబంధనలను కఠినతరం చేసింది.
→ రుణానికి సంబంధించి కీలక సమాచార నివేదికను (కేఎఫ్‌ఎస్) రుణ గ్రహీతకు ఇవ్వాల్సిందేనని తేలి్చంది.
→ రుణ గ్రహీత కాంటాక్టులు, ఫైల్స్ యాక్సెస్‌ను కట్టడి చేసింది.
→ రుణాలను ఇస్తున్న బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
→ కేంద్రం, దర్యాప్తు సంస్థలు చట్టవిరుద్ధమైన యాప్స్‌ను బ్లాక్ చేయించాయి.
→ అయినప్పటికీ కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటున్నాయి. రుణ గ్రహీతలు విచక్షణతో వ్యవహరిస్తేనే బయటపడగలుగుతారు.
తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఎక్కువే
→ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డిజిటల్ లెండింగ్ యాప్‌లకు గ్రోత్ సెంటర్లుగా మారాయనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు.
→ స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికంగా ఉండడం, గిగ్ ఎకానమీ (తాత్కాలిక పనులతో కూడిన ఉపాధి అవకాశాలు) విస్తరిస్తుండడం, వినియోగ ధోరణి కొత్త పుంతలు తొక్కుతుండడం, స్టాక్ ట్రేడింగ్ పట్ల పెరుగుతున్న ఆసక్తి ఇలా ఎన్నో కారణాలున్నాయి.
→ ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో లోన్ యాప్స్ విస్తరణ రాకెట్ వేగాన్ని తలపిస్తోంది. దాంతో మనదగ్గర బాధితులు ఎక్కువే.
ఇవి డేంజర్ బెల్స్..
→ ఆదాయంలో రుణ వాయిదాలు 40 శాతం మించడం.
→ ఒకే సమయంలో రుణాలు మూడుకు మించడం.
→ ఒక రుణం నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని తీసుకోవడం.
→ రుణ విషయాలను రహస్యంగా ఉంచడం.
విద్యావంతులదీ అదే దారి...
→ యాప్స్ ద్వారా ఎడాపెడా రుణాలు తీసుకుంటున్న వారిలో అందరూ పేదవారే అనుకోవటానికి లేదు. ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులు సైతం ఉంటుండడం ఆర్థిక క్రమశిక్షణ లేమిని సూచిస్తోంది.
→ కాంట్రాక్టు ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు, అసంఘటిత రంగంలోని కార్మికులు తదితర తక్కువ ఆదాయ వర్గాల వారు సులభంగానే ఈ లోన్ యాప్ ట్రాప్‌లో పడుతున్నారు.
→ వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలను ఇష్టారీతిన వాడేసిన విద్యావంతులు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, స్టాక్ మార్కెట్ డే ట్రేడర్లు, యువ వేతన జీవులు, క్రిప్టో ఇన్వెస్టర్లు సైతం ట్రేడింగ్‌లో చేతులు కాల్చుకుని.. లోన్ యాప్స్‌ను ఆశ్రయిస్తుండడం విస్మయం కలిగిస్తోంది.
వసూళ్లలోనూ అరాచకం..
→ డిజిటల్ యాప్ కదా రుణం తీసుకుని కట్టకపోయినా ఏం కాదులే? అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు. వసూలు కోసం అవి అనుసరించే మార్గాలు తెలిస్తే వళ్లు జలదరిస్తుంది.
→ ఊళ్లల్లో వడ్డీ వ్యాపారుల గురించి వినే ఉంటారు. 5–10 రూపాయల వడ్డీతో రోజువారీ/నెలవారీ వసూలు చేసుకునే వారిని చూస్తే అప్పు తీసుకున్న వారు వణికిపోయే పరిస్థితి. ఇప్పుడు సంఘటిత ముసుగులోని లెండింగ్ యాప్‌లు, ఫిన్‌టెక్‌లు వీరిని మించి వ్యవహరిస్తున్నాయి. .
→ ఈ యాప్స్‌కు ఫోన్‌లోని కాంటాక్టులు, కాల్ లాగ్, ఫొటో గ్యాలరీలు, డివైజ్‌ను మానిటర్ చేసే రైట్స్‌ను రుణ గ్రహీతలు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది.
→ రుణాన్ని చెల్లించనప్పుడు రుణ గ్రహీత బంధువులకు ఫోన్ కాల్స్ వేధింపులు ఆరంభమవుతాయి. అంతేకాదు అతడు/ఆమె పనిచేసే యాజమాన్యానికీ మెస్సేజ్‌లు వెళతాయి. రుణ గ్రహీత ఫోన్‌లోని ఫొటోలను మారి్ఫంగ్ చేసి వాటి ఆధారంగా బెదిరింపులూ ఎదురుకావొచ్చు.
→ వాట్సాప్ గ్రూపుల్లోనూ డీఫేమ్ చేస్తాయి. ఇలా వీలైన ప్రతీ మార్గంలో రుణ గ్రహీతలను వెంటాడి, వేధించి వసూలు చేసుకోవడమే వాటికి తెలిసిన విద్య.


