బినామీ ఆస్తులు... దాని వ్యవహారాలను భారతదేశంలో నిషేధించారు. ఇందుకు సంబంధించి 1988లో చట్టమే వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన, బలమైన చట్టం.
ఆస్తి అంటే: బినామీ వ్యవహారాలన్నీ ఆస్తి చుట్టూ తిరుగుతాయి. అందుకని ‘ఆస్తి’ అనే పదాన్ని బాగా నిర్వచించారు. చట్టంలో ఈ నిర్వచనం కష్టమయితే చాలా తెలివిగా, పరిధి ఎక్కువగా ఉండేలా వివరణ ఇచ్చారు. ఈ క్రిందివన్నీ ‘ఆస్తి’ అని పెద్ద జాబితా చెబుతారు. ఈ నిర్వచనం చదివితే మీకు భగవద్గీత స్ఫురణకు రాకతప్పదు.
(1) ఏ రకమయినా.. స్థిరమైన, అస్థిరమైన, కంటికి కనిపించేవి... కనపడవని... భౌతికమైనవి... నిరాకారమైనవి.
(2) హక్కు, ఆసక్తి, దస్తావేజుల్లో పేరు, ప్రస్తావన
(3) రూపాంతరం చెందగలిగే ఆస్తి
(4) పై పేర్కొన్న 1,2,3 ఆస్తుల ద్వారా వచ్చిన వసూళ్లు ..రియల్ ఎస్టేట్, భూములు, ఇళ్లు, పొలాలు, స్థిరాస్తులు, షేర్లు, వేతనాలు, ఫిక్సిడ్ డిపాజిట్లు, బ్యాంకు డిపాజిట్లు, నగదు బ్యాంకు లాకర్లు, ప్రయివేటు లాకర్లు మొదలైనవి.
బినామీ వ్యవహారం ఏమిటంటే..
➤ఒక వ్యవహారం–ఒప్పందం.. ఒక ఆస్తికి కాగితాల ప్రకారం ఓనర్ (యజమాని) ఓనమాలు రాని ఓబయ్య అయితే.., ఆ వ్యవహారానికి మదుపు పెట్టినది చదువుకున్న చలమయ్య. ఇందులో చలమయ్య గారికి ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది.
➤లేని వ్యక్తి పేరు మీద, డమ్మీ వ్యక్తి పేరు మీద జరిగే వ్యవహారం... కర్త, కర్మ, క్రియ... ఒకరైతే.. అబద్దపు పేరుతో దస్తావేజులు తయారవుతాయి.
➤ఒక వ్యక్తి/సంస్థకి తెలియకుండా/చెప్పకుండా/ ఎరుకలో లేకుండా జరిగిన వ్యవహారం. విచారణలో నాకు తెలియదు, నేను కాదని, నాకు హక్కు లేదని ధ్రువీకరించిన కేసులు.
➤కొన్ని వ్యవహారాల్లో మనిషి కల్పితం (చందమామ బేతాళ కథల్లోలాగా).
గాభరా పడొద్దు.. వీటికీ మినహాయింపులున్నాయి. హిందూ ఉమ్మడి కుటుంబంలో కర్త కాని, సభ్యులు కాని వారి పేరు మీద ఆస్తి ఉంచుకోవచ్చు. కానీ సోర్స్ మాత్రం కుటుంబం నుంచే రావాలి. ప్రయోజనం ఉమ్మడి కుటుంబానికే చెందాలి. ట్రస్టుల్లో, భాగస్వామ్యంలో, కంపెనీల్లో, డిపాజిటరీలాగా, ఏజెంటులాగా, విశ్వాసపాత్రుడి హోదాలో వ్యవహారాలు.. కుటుంబంలో భార్యభర్తల పేరు మీద, పిల్లల పేరు మీద జరిగే వ్యవహారాలు మొదలైన వాటికి సోర్స్ కుటుంబ సభ్యుల నుంచే రావాలి. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, గత తరంగానీ, భవిష్యత్తు తరంగానీ, జాయింట్ ఓనర్స్... డాక్యుమెంట్ ప్రకారం ఉండి.. సోర్స్ వారిలో ఎవరి దగ్గర్నుంచైనా ఉండాలి. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే ‘సోర్స్’ అంటే ‘కెపాసిటీ‘ ఉండాలి. నిజమైన వ్యవహారం అయి ఉండాలి. డమ్మీలుండకూడదు.
మరి కొన్ని ఉదాహరణలు గమనించండి..
➤‘అ’ అనే అన్నగారు ఒక ఇల్లు కొన్నారు. తానే డబ్బు ఇచ్చారు. కానీ ‘ఆ’ అనే వదిన గారి పేరు మీద రిజిస్టేషన్ జరిగింది. ‘అ’ ఆ ఇంట్లోనే ఉంటారు. ఈ కేసులో ‘ఆ’ బినామీదారు. ‘అ’ ప్రయోజనం పొందిన వ్యక్తి.
➤ఇక మరో కేసు. ఇది వింటే ‘మత్తు’ వదిలిపోతుంది. 'పీ’ అనే వ్యక్తికి లిక్కర్ లైసెన్సు ఉంది. తన ఉద్యోగి ‘ఖ’ పేరు మీద అన్ని చెల్లింపులు. కానీ రాబడి అంతా 'పీ’దే. ఇదొక బినామీ వ్యవహారం.
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కల్పిత పేర్లతో, లేనివారి పేరు మీద, మరణించిన వారి పేరుతో మీద పెడతారు. ఇదీ బినామీయే.
ఉద్యోగస్తుల పేరు మీద బ్యాంకు లాకర్లు తెరిచి అందులో నగదు, బంగారం పెట్టడం, అలాగే బంధువుల పేరు మీద వ్యవహారాలు చేయడం.. ఇటువంటి వ్యవహారాల్లో బేతాళ కథల్లోని కల్పిత వ్యక్తి ... బినామీదారు. తన గుట్టు చెప్పకుండా ప్రయోజనం పొందే వ్యక్తి, ప్రయోజనం పొందిన వ్యక్తిని ఈ పేరుతో వ్యవహరిస్తారు.
ఈ వ్యవహారాలు/ఆస్తులు, ఇందులోని సూత్రధారులు అందరూ శిక్షార్హులే! ‘‘బినామీ వ్యవహారాలకు దూరంగా ఉండండి’’ అని డిపార్టుమెంటు వారు జారీ చేసిన కరపత్రాలు చదవండి. బినామీ అంటే సునామీ లాంటిది.


