బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌: వరుస సెలవులు | Bank Holidays Next Week Banks Closed 4 Days check list | Sakshi
Sakshi News home page

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌: వరుస సెలవులు

Jun 21 2026 8:57 AM | Updated on Jun 21 2026 11:16 AM

Bank Holidays Next Week Banks Closed 4 Days check list

వచ్చే వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకు వినియోగదారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోహర్రం సందర్భంగా జూన్ 25, 26 తేదీల్లో రాష్ట్రాలవారీగా బ్యాంకులకు సెలవులు ఉండగా, అనంతరం నాలుగో శనివారం (జూన్ 27), ఆదివారం (జూన్ 28) రావడంతో అనేక ప్రాంతాల్లో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.

ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం మోహర్రం సందర్భంగా సెలవుల తేదీలు రాష్ట్రానికోలా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఆర్బీఐ పరిధిలోని బ్యాంకులకు జూన్ 25న సెలవు ఉండగా, తెలంగాణ సహా దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో జూన్ 26న మోహర్రం సెలవు వర్తించనుంది.

జూన్ 26న హైదరాబాద్‌, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, భోపాల్‌, లక్నో, పాట్నా, రాంచీ తదితర నగరాల్లో బ్యాంకు శాఖలు పనిచేయవు. జూన్ 27 నాలుగో శనివారం, జూన్ 28 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూసి ఉంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి.

బ్యాంకు శాఖలు మూసివున్నప్పటికీ డిజిటల్‌ సేవలకు అంతరాయం ఉండదు. యూపీఐ, ఐఎంపీఎస్‌, నెట్‌బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ, నిధుల బదిలీ, బిల్లు చెల్లింపులు వంటి సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ సేవలు కూడా సెలవు రోజుల్లో కొనసాగుతాయి. అయితే నిర్వహణ పనుల కారణంగా కొన్ని సందర్భాల్లో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వినియోగదారులు ముందుగానే ముఖ్యమైన లావాదేవీలు పూర్తి చేసుకోవడం మంచిది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement