
రుణాలను చౌకగా చేయడానికి ఓవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రయత్నిస్తుంటే మరోవైపు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాత్రం రుణ గ్రహీతకు వింత షాకిచ్చింది. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 5.5 శాతానికి తగ్గించినప్పటికీ, ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేట్లను పెంచి ఆశ్చర్యపరిచింది. ఈ బ్యాంక్‌లో కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేటు ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు పెరగనుంది.
ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్ల గరిష్ట పరిమితిని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. లోయర్ ఎండ్ 7.50 శాతం వద్ద కొనసాగుతుండగా, ఎగువ బ్యాండ్ 8.45 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఈ మార్పు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు సాధారణంగా అధిక వడ్డీ రేటు పరిధిలోకి వస్తారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం 7.35 శాతం నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఎస్‌బీఐ బాటలో పయనించే అవకాశం ఉంది. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆర్బీఐ రెపో రేటును వరుసగా మూడుసార్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల గృహ రుణాలతో సహా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం వల్ల పరోక్షంగా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.
ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల గృహ రుణాలు చౌకగా లభిస్తాయని ఇదే ఎస్‌బీఐ గతంలో ఒక నివేదికను విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్ సేకరించిన డేటా ప్రకారం.. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాలలో 60 శాతం ఉన్న ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)తో అనుసంధానించిన రుణాలలో ఈ మార్పు చాలా వెంటనే కనిపిస్తుంది.
👉 ఇదీ చదవండి: ఎస్‌బీఐ ప్రత్యేక లోన్: తాకట్టు లేకుండా రూ.4 లక్షలు