
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యంలోని అగ్నివర్ల కోసం ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న అగ్నివీర్‌లు ఎటువంటి పూచీకత్తు లేదా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రూ .4 లక్షల వరకు రుణాలు పొందవచ్చని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ రుణాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి అగ్నిపథ్ పథకం కాలపరిమితి అంటే సైనికులు సర్వీసులో ఉండే కాలానికి అనుగుణంగా ఉంటుంది. దేశం కోసం సైన్యంలో సేవలు అందించి తిరిగి సాధారణ పౌర జీవితంలో వచ్చే సైనికులకు ఆర్థికంగా సహకారం అందించే లక్ష్యంతో ఎస్‌బీఐ ఈ ప్రత్యేక లోన్ స్కీమ్‌ను ప్రకటించింది. అలాగే 2025 సెప్టెంబర్ 30 వరకు రక్షణ సిబ్బంది తీసుకునే రుణాలకు 10.50 శాతం ఫ్లాట్ వడ్డీ రేటును ఎస్‌బీఐ అందిస్తోంది.
‘మన స్వాతంత్య్రాన్ని కాపాడుతున్న వాళ్లకు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు మా అచంచలమైన మద్దతు అవసరమని మేము నమ్ముతున్నాం. ఈ జీరో ప్రాసెసింగ్ ఫీజు కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సాహస వీరులకు సాధికారత కల్పించే పరిష్కారాలను సృష్టించడం కొనసాగిస్తాం’ అని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.
ఇదే కాకుండా తమ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్లు ఉన్న భారత సాయుధ దళాల సిబ్బందికి అనేక ప్రయోజనాలను ఎస్‌బీఐ కల్పిస్తోంది. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ఉచిత అంతర్జాతీయ గోల్డ్ డెబిట్ కార్డులు, దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఏటీఎంలలో అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలు, డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీల మాఫీ వంటి అనేక ప్రయోజనాలను ఈ ప్యాకేజీ అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. వీటితోపాటు రూ.50 లక్షల కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.కోటి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.50 లక్షల వరకు శాశ్వత అంగవైకల్యానికి కవరేజీ లభిస్తుంది.