
పీవీలు, టూవీలర్స్‌కు డిమాండ్ క్షీణత ప్రభావం
ఆటో మొబైల్ సమాఖ్య ఫాడా గణాంకాలు వెల్లడి
న్యూఢిల్లీ: రిటైల్ వాహన విక్రయాలు జూలైలో తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే నెలలో 20,52,759 వాహనాలు అమ్ముడయ్యాయి. ఈసారి 4% తగ్గి 19,64,213 యూనిట్లుకు దిగివచ్చాయి. ప్రయాణికుల వాహనాలు(పీవీలు), టూ–వీలర్స్‌కు డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఆటో మొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది.
→ ప్యాసింజర్ విక్రయాలు గతేడాది జూలైలో పోలిస్తే 3,31,280 యూనిట్లు నుంచి స్వల్పంగా 0.81% తగ్గి 3,28,613 కు పరిమితమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
→ ద్వి చక్రవాహనాల రిజిస్ట్రేషన్ 6.48% క్షీణత చవిచూసింది. ఈ జూలైలో మొత్తం 13,55,504 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 14,49,487 యూనిట్లుగా ఉన్నాయి. వ్యవసాయ కార్యక్రమాలు మొదలవడం, అధిక వర్షాలు కొనసాగడం గ్రామీణ ప్రాంత డిమాండ్‌ను దెబ్బతీసింది. పండుగ సీజన్ ప్రారంభం నేపథ్యంలో వాహన కొనుగోలు నిర్ణయం ఆగస్టుకు వాయిదా పడిందని పరిశ్రమ నిపుణులు తెలిపారు.
→ వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు జూలైలో 76,261 యూనిట్ల నుంచి స్వల్పంగా 0.23% పెరిగి 76,439 యూనిట్లకు చేరుకున్నాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణలు, తగ్గిన మోతాదులు నిల్వలు పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య వాహనాలకు డిమాండ్ లభించింది. అయితే అధిక వర్షపాతాలు, రవాణా సమస్యలు, రుణ పంపిణీ మందగమన అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ను తగ్గించాయి.
→ ట్రాక్టర్ల రిటైల్ అమ్మకాలు 11% పెరిగి 79,961 యూనిట్ల నుంచి 88,722 యూనిట్లకు పెరిగాయి. అధిక వర్షపాత అంచనాలు, వ్యవసాయ సబ్సిడీలు పెరగడం ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు కారణమయ్యాయి.