భారతదేశ ఆర్థిక సుస్థిరతకు పెరుగుతున్న ఆర్థిక లోటు (Fiscal Deficit) ప్రధాన బలహీనతగా మారిందని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అర్వింద్ సుబ్రహ్మణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ లోటును తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల ‘భారతదేశ అభివృద్ధి మార్గం’ అనే అంశంపై నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణపై పలు వ్యాఖ్యలు చేశారు.
‘ప్రికోసియస్ డెమోక్రసీ’ ప్రభావం
భారతదేశం అభివృద్ధికి ముందే పరిణతి చెందిన ప్రజాస్వామ్యం (Precocious Democracy)గా అవతరించిందని సుబ్రహ్మణియన్ అభివర్ణించారు. సమాజంలోని ప్రతి వర్గం నుంచి వచ్చే డిమాండ్లను ప్రజాస్వామ్యబద్ధంగా తీర్చాల్సి రావడం కీలకంగా మారుతుంది. ఇది దేశ ఆర్థిక అలవాట్లపై ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారత ప్రభుత్వ లోటు సగటున జీడీపీలో 10 శాతం వరకు ఉంటోందన్నారు. మనతో సమానంగా ఎదుగుతున్న ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని ఆయన గుర్తుచేశారు.
సంక్షేమ పథకాలపై సమీక్ష అవసరం
ప్రస్తుతం భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుండటం వల్ల ద్రవ్యలోటును తట్టుకోగలుగుతోందని ఆయన విశ్లేషించారు. అయితే, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ‘కేంద్రం, రాష్ట్రాలు రెండూ తమ ఆర్థిక లోటును క్రమంగా తగ్గించుకోవాలి. నగదు బదిలీ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని పునసమీక్షించాలి. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరం లేకపోయినా, బాధ్యతాయుతమైన వ్యయం తప్పనిసరి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!


