2030 నాటికి 2.5 కోట్ల ఉద్యోగాలు! - అమితాబ్‌ కాంత్‌

Amitabh Kant Says Hospitality Industry Job Creations - Sakshi

ఆతిథ్య, పర్యాటక రంగానికి జీ20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ విజ్ఞప్తి

2030 నాటికి 2.5 కోట్ల ఉద్యోగ కల్పన చేయాలని సూచన 

న్యూఢిల్లీ: పరిశ్రమ, మౌలిక రంగ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న  ఆతిథ్య, పర్యాటక రంగ సంస్థలకు భారతదేశ జీ20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ కీలక సూచన చేశారు. పరిశ్రమ, మౌలిక సదుపాయాల హోదా కల్పన కోసం సహాయం చేయాలని రాజకీయ నాయకులను ఒకపక్క కోరడంతోపాటే, మరోవైపు 2030 నాటికి 2.5 కోట్ల ఉద్యోగాల కల్పన గురించి కూడా వారికి భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు. 

హోటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఏఐ) నిర్వహించిన 6వ హోటల్స్‌ కాంక్లేవ్‌లో కాంత్‌ మాట్లాడుతూ, పరిశ్రమ హోదా కోసం  ఆతిథ్య, పర్యాటక రంగ డిమాండ్‌ సరైనదేనన్నారు. అయితే ఈ రంగం భారీ ఉపాధి అవకాశాలను అందిస్తుందని రాజకీయ నాయకులకు తెలియజేయడంలో విఫలమైందని పేర్కొన్నారు.  

‘‘మీరు టూరిజం వైపు చూస్తే, రాజకీయ దృక్కోణం నుండి నేను ఆలోచిస్తాను.  రాజకీయ నాయకులు ఒక విషయం మాత్రమే అర్థం చేసుకుంటారు. పర్యాటక రంగం ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తోంది అని మాత్రమే వారు ఆలోచిస్తారు. ఇక్కడ వారికి భరోసా లభిస్తే.. ఈ రంగం కోసం ఎటువంటి పెద్ద నిర్ణయమైనా ప్రభుత్వం నుంచి వెలువడుతుంది’’ అని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

  • పర్యాటక రంగం సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి భారీ సానుకూల స్పందన ఉంటుంది. అయితే ఉద్యోగాల సృష్టికర్తలమని రాజకీయ నాయకులకు చెప్పడంలో పర్యాటక రంగం విఫలమైందని నేను భావిస్తున్నాను.
  • ఉపాధి పరంగా, థాయ్‌లాండ్‌ దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు, మలేషియా 1.5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తే... భారతదేశం పర్యాటక రంగం మాత్రమే 78 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తోంది.
  • ఎంఐసీఎస్‌ (మీటింగ్, ఇన్సెంటివ్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్‌) విభాగంలో అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి ఆతిథ్య, పర్యాటక రంగం కృషి చేయాలి.  యశోభూమి, భారత్‌ మండపం ఆవిష్కరణతో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ కన్వెన్షన్‌ అలాగే ఎక్స్‌పో సెంటర్‌లను కలిగి ఉంది.
  • ప్రపంచ మార్కెట్‌లో 500 బిలియన్‌ డాలర్లకు పైగా ఉన్న ఎంఐసీఈ విభాగంలో భారత్‌ వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది విచారకరమైన అంశం.

ఏడేళ్లలో ఐదుకోట్ల ఉద్యోగాలు: హెచ్ఏఐ 
కాగా, రాబోయే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో 5 కోట్ల ప్రత్యక్ష –పరోక్ష ఉద్యోగాలను సృష్టించాలని పర్యాటక, ఆతిథ్య రంగం భావిస్తోంది. అయితే పూర్తి పరిశ్రమ,  మౌలిక సదుపాయాల హోదా పొందేందుకు ప్రభుత్వ మద్దతు అవసరమని హోటల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఏఐ) తెలిపింది. తాము కోరుకుంటున్న ప్రత్యేక హోదా కేవలం వసతులను సృష్టించడానికి మాత్రమే కాకుండా, ఈ రంగం ఆదాయం పరంగా, ఉపాధి కల్పనా పరంగా పురోగమించడానికి దోహదపడుతుందని హెచ్‌ఏఐ ప్రెసిడెంట్‌ పునీత్‌ ఛత్వాల్‌ 6వ హెచ్‌ఏఐ హోటల్స్‌ కాంక్లేవ్‌లో పేర్కొన్నారు.   

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top