ప్రతి ఉద్యోగికి ఆదివారం సెలవు కదా. మధ్యాహ్నం వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, సూర్యుడు అస్తమిస్తున్న కొద్దీ.. మెల్లగా గుండెల్లో ఏదో తెలియని ఆందోళన. రేపు సోమవారం! మళ్ళీ అదే ఆఫీసు, అదే మెయిళ్ళు, అవే మీటింగులు. దీన్నే మానసిక శాస్త్రవేత్తలు 'సండే నైట్ బ్లూస్' (Sunday Night Blues) అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు ఈ రకమైన ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అసలు సెలవు రోజైన ఆదివారమే ఈ భయం ఎందుకు మొదలవుతుంది?
అదో ముందస్తు హెచ్చరిక
మన మెదడు చాలా తెలివైనది. అది ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది. ఆఫీస్ అనేది రోజూ ఒత్తిడిని, అవమానాన్ని లేదా నిర్లక్ష్యాన్ని రుచి చూపించే స్థలమైతే.. ఆదివారం రాత్రే మీ శరీరం 'అలర్ట్ మోడ్'లోకి వెళ్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్ర పట్టకపోవడం, చిరాకు పెరగడం.. ఇవన్నీ మీలో మానసిక రక్షణ (సైకాలజికల్ సేఫ్టీ) కరువైందని చెప్పడానికి సంకేతాలు. ఇది డ్రామా కాదు, మీ మనసు పడుతున్న ఆవేదన.
నా వద్దకు వచ్చిన సురేష్ అనే ఐటీ ఉద్యోగి కథే దీనికి ఉదాహరణ. సురేష్ ప్రతి ఆదివారం సాయంత్రం ఆరుగంటల నుంచే చిరాకు పడటం మొదలుపెట్టేవాడు. ఫలితంగా భార్యాపిల్లలతో గొడవలు జరిగేవి. "సోమవారం ఆఫీసులో ఏం జరుగుతుందో అన్న ఊహే నన్ను చంపేస్తోంది" అని అతను వాపోయాడు.
అతని దినచర్యను గమనించినప్పుడు, అతను శుక్రవారం సాయంత్రం తన డెస్క్ మీద పనులన్నీ చిందరవందరగా వదిలేసి వచ్చేవాడని తెలిసింది.నేను అతనికి'ఫ్రైడే క్లోజర్'టెక్నిక్ నేర్పించా. శుక్రవారం వెళ్లేముందే సోమవారం చేయాల్సిన పనులను లిస్ట్ రాసి, డెస్క్ క్లీన్ చేసి రావడం వల్ల అతని 'సండే భయం' 70 శాతం తగ్గిపోయింది.
భయపెట్టేది పని కాదు..
చాలామంది ‘పని ఎక్కువగా ఉంది’ అని భయపడుతుంటారని అనుకుంటారు. కానీ లోతుగా ఆలోచిస్తే, భయపెట్టేది పని కాదు.. వర్క్ ప్లేస్ లో ఎదురయ్యే అనుభవం.
• ఆఫీసులో తగిన గౌరవం లేకపోవడం, ఏ మాట్లాడితే ఎవరు తప్పుగా అర్థం చేసుకుంటారో అన్న భయం, ఎంత చేసినా "ఇంకా ఏదో తక్కువైంది" అనే విమర్శ,ప్రతిరోజూ మనల్ని మనం నిరూపించుకోవాల్సిన ఈ ఒత్తిడే సోమవారం భయంగా రూపాంతరం చెందుతుంది.
• శని, ఆదివారాలు మనకు నచ్చినట్టు ఉంటాం. సోమవారం రాగానే మళ్ళీ ఎవరికో సమాధానం చెప్పాలి, ఎవరో ఇచ్చిన రూల్స్ పాటించాలి. మనస్వేచ్ఛకోల్పోతున్నామనేభావనసోమవారం భయంగా రూపాంతరం చెందుతుంది.
• శుక్రవారం ఆఫీసు వదిలేటప్పుడు ఏదైనా పనిని సగం లోనే వదిలేస్తే, అది ఆదివారం రాత్రికి భూతంలా గుర్తుకొస్తుంది.దీన్నేZeigarnik Effectఅంటారు.
• వారం అంతా పడ్డ కష్టానికి రెండు రోజుల సెలవు సరిపోవట్లేదనే అసంతృప్తి సోమవారం మీద ద్వేషంగా మారుతుంది.
సోమవారాన్ని స్వాగతించడానికిచిట్కాలు...
కేవలం ‘పాజిటివ్ గా ఆలోచించు’ అంటే ఈ సమస్య పోదు. దీనికి అసలు మూలాలను వెతకాలి.ఈ భయం పని భారం నుంచా? వ్యక్తుల నుంచా? లేక గౌరవ లోపం నుంచా? అనేది స్పష్టంగా తెలుసుకోండి.
• శుక్రవారం ఆఫీస్ వదిలే ముందే సోమవారం పనుల లిస్ట్ రాసి పెట్టుకోండి. అప్పుడు అసంపూర్ణ పనులు మెదడును ఆదివారం వేధించవు.
• చాలామంది బట్టలు ఉతకడం, ఇంటి సామాన్లు తేవడం వంటి పనులన్నీ ఆదివారం పెట్టుకుంటారు. దీనివల్ల మనసుకి విశ్రాంతి దొరకదు. వీలైతే శనివారమే ఈ పనులన్నీ ముగించేయండి. ఆదివారాన్ని మీకు నిజంగా ఆనందాన్నిచ్చే ఒక వ్యాపకానికికేటాయించండి.
• చాలామంది ఆదివారం సాయంత్రం ఇంట్లోనే ఉండి సోమవారం ఆఫీస్ గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా నచ్చిన సినిమా చూడటం, స్నేహితులతో మాట్లాడటం వంటివి ‘స్పెషల్ ప్లాన్’ చేస్తే మెదడు ఆందోళన నుండి మళ్లుతుంది.
• మీకు నచ్చిన టిఫిన్ చేయడం లేదా ఆఫీసులో నచ్చిన కొలీగ్‌తో లంచ్ ప్లాన్ చేయడం వంటి చిన్న చిన్న సంతోషాలను సోమవారం కోసం దాచుకోండి.
• శనివారం రాత్రి పొద్దుపోయి నిద్రపోయి, ఆదివారం మధ్యాహ్నం వరకు పడుకోవడం వల్ల మీ 'బాడీ క్లాక్' దెబ్బతింటుంది. ఇది సోమవారం ఉదయం మిమ్మల్ని మరింత నీరసంగా మారుస్తుంది. అందుకే నిద్రవేళలు మార్చకండి.
• భయం మీ నియంత్రణ తప్పుతుంటే ఒక కోచ్ లేదా కౌన్సిలర్ సాయం తీసుకోవడం బలహీనత కాదు.. అది ఆత్మగౌరవం.
సోమవారం అనేది కేవలం ఒక వారం ప్రారంభం మాత్రమే కాదు, మీ ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన మరో అవకాశం. భయాన్ని పక్కన పెట్టి, సన్నద్ధతతో అడుగు వేయండి.రేపటి సోమవారం ఒక భారంగా కాక, ఒక అవకాశంగా మారాలని ఆశిస్తూ..
-సైకాలజిస్ట్ విశేష్
కెరీర్&మైండ్‌సెట్ కోచ్
8019 000067
www.psyvisesh.com


