గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యూరోపియన్ మిత్రదేశాల నుంచి కొంత వ్యతిరేక స్పందన (pushback) వ్యక్తమవుతుండగా, ఆయన ఈ రోజు దావోస్‌కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) కాంగ్రెస్ హాల్‌లోని ‘జోన్ సిలో’ వద్ద వందలాది మంది ప్రతినిధులు క్యూకట్టారు. ట్రంప్ ప్రసంగంపై అంతర్జాతీయంగా భారీ ఆసక్తి నెలకొంది.
అధ్యక్ష పదవికి ఏడాది.. ట్రంప్ ప్రశంసలు
అధ్యక్ష పదవిలో ఏడాది పూర్తి అయిన సందర్భంగా దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వేదికపై ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పాలనలో సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు.
“నిన్న నా ప్రమాణ స్వీకారానికి ఏడాది పూర్తైంది. ఈ రోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి ఉధృతంగా ఉంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గతంలో తెరిచి ఉన్న ప్రమాదకరమైన సరిహద్దులు ఇప్పుడు మూసివేయబడ్డాయి. అమెరికా తన చరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపు దశలో ఉంది” అని ట్రంప్ అన్నారు.
యూరప్ సరైన దిశలో లేదు
డబ్ల్యూఈఎఫ్ వేదికపై మాట్లాడిన ట్రంప్, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు “గుర్తించలేనంతగా మారిపోయాయి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో “వాదనకు తావు లేదని” పేర్కొన్నారు.
“నేను ఐరోపాను ప్రేమిస్తున్నాను. ఐరోపా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం అది సరైన దిశలో ముందుకు సాగడం లేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు.
అలాగే, ప్రపంచంలోని సుమారు 40 శాతం దేశాలతో అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. వివిధ దేశాలపై విధించిన సుంకాల వల్ల అమెరికాలో భారీ వాణిజ్య లోటులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.
గ్రీన్‌లాండ్ కావాల్సిందే..
అమెరికా, రష్యా, చైనాల మధ్య కీలకమైన వ్యూహాత్మక ప్రదేశంలో గ్రీన్‌లాండ్ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాకు ఈ ద్వీప భూభాగం దాని ఖనిజాల కోసం కాదని, "వ్యూహాత్మక జాతీయ, అంతర్జాతీయ భద్రత" కోసం అవసరమని అమెరికా అధ్యక్షుడు అన్నారు.
డెన్మార్క్‌కు కృతజ్ఞత లేదని ట్రంప్ ఆక్షేపించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత "గ్రీన్‌లాండ్ ను తిరిగి ఇవ్వడం" అమెరికా "మూర్ఖత్వం" అని అన్నారు. "మేము డెన్మార్క్ కోసం గ్రీన్‌లాండ్‌లో స్థావరాలను ఏర్పాటు చేశాం. డెన్మార్క్ కోసం పోరాడాము. గ్రీన్‌లాండ్‌ను రక్షించాం. శత్రువులు అడుగు పెట్టకుండా నిరోధించాము. యుద్ధం తర్వాత మేము గ్రీన్లాండ్ ను తిరిగి డెన్మార్క్ కు ఇచ్చాము. అలా చేయడం మా తెలివి తక్కువతనం' అన్నారు.
మరోవైపు గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయండం వల్ల నాటోకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. నాటోనే అమెరికాను "చాలా అన్యాయంగా" చూస్తోందని ట్రంప్ విమర్శించారు.


