చిట్కాలు చెప్పండి..  బహుమతి పొందండి!  | Air India incoming CEO to reward staff for cost-saving ideas | Sakshi
Sakshi News home page

చిట్కాలు చెప్పండి..  బహుమతి పొందండి! 

Sep 29 2026 5:00 AM | Updated on Sep 29 2026 5:00 AM

Air India incoming CEO to reward staff for cost-saving ideas

పొదుపు ‘ఐడియా’లకు ఎయిరిండియా రివార్డులు 

భద్రత, లాభదాయక వృద్ధికి ప్రాధాన్యం 

ఆదాయ మార్గాలపై కొత్త సీఈవో దృష్టి 

న్యూఢిల్లీ: వ్యయ నియంత్రణ, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడే చిట్కాలు చెబితే ఉద్యోగులకు బహుమతులు ఇస్తామని సంస్థ ఎయిరిండియా కాబోయే సీఈవో, ఎండీ టెవోల్డే గెబ్రెమరియమ్‌ తెలిపారు. అవసరమైన భద్రతా అనుమతులు పొందిన తర్వాత ఆయన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉద్యోగులతో జరిగిన ‘టౌన్‌హాల్‌’ సమావేశంలో మాట్లాడుతూ ... ఎయిరిండియాలో వ్యయ నియంత్రణ, క్రమశిక్షణ అనే రెండు అంశాలు ప్రతీ ఉద్యోగి జీవనశైలిగా మారాలని పిలుపునిచ్చారు.

 ‘‘వ్యయాల నియంత్రణ అనేది కేవలం యాజమాన్యం లేదా ఆర్థిక విభాగం బాధ్యత మాత్రమే కాదు. ప్రతి ఉద్యోగి ఖర్చులు తగ్గించేందుకు తమ వంతు సహకారం అందించాలి. అలాంటి పొదుపు చర్యలు సంస్థకు పెద్ద మొత్తంలో ప్రయోజనాన్ని కల్పిస్తాయి. ఉద్యోగులు ఏ హోదాలో ఉన్నా.. కస్టమర్లకు సరైన సేవలు అందించేలా, సంస్థ శ్రేయస్సుకు దోహదపడే నిర్ణయాలు తీసుకునేలా వారికి సంపూర్ణ అధికారాలు ఇస్తాం’’ అని గెబ్రెమరియమ్‌ స్పష్టం చేశారు. 

భద్రత అందరి ఉమ్మడి బాధ్యత 
ఇటీవల ఎయిరిండియా పైలట్లలో ఒకరు డ్రగ్స్‌ పరీక్షలో, మరొకరు మద్యం (బ్రీత్‌ అనలైజర్‌) పరీక్షలో విఫలమైన ఘటనలపై ఆయన స్పందించారు. ‘‘భద్రత అనేది అందరి ఉమ్మడి బాధ్యత. సంస్థలో ఏ చిన్న లోపం లేదా సమస్య కనిపించినా ఉద్యోగులు వెనకాడకుండా వెంటనే ఉన్నతాధికారులకు నివేదించే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని పెంపొందిస్తాం. విమాన భద్రత విషయంలో రాజీపడేది లేదు’’ అని స్పష్టం చేశారు. 

ఆదాయం, ఖర్చులపై దృష్టి 
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విమాన ఇంధన ధరల పెరుగుదల, భారతీయ విమానయాన సంస్థలపై విధించిన గగనతల ఆంక్షలు ఎయిరిండియాపై ప్రతికూల ప్రభావం చూపాయని గెబ్రెమరియమ్‌ పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఎయిరిండియా రూ.22,238.23 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆదాయ మార్గాలను పెంచుకోవడంతో పాటు నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ నెట్‌వర్క్, కార్గో బిజినెస్, వాణిజ్య విభాగాల ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement