అదానీ మెగా బ్యాటరీ స్టోరేజ్‌! | Adani Plans to Build India Largest Battery Storage System | Sakshi
Sakshi News home page

అదానీ మెగా బ్యాటరీ స్టోరేజ్‌!

Nov 12 2025 2:03 AM | Updated on Nov 12 2025 2:03 AM

Adani Plans to Build India Largest Battery Storage System

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ పునురుత్పాదక (రెన్యూవబుల్‌) ఇంధన రంగంలో మరిన్ని భారీ ప్రణాళికలకు తెరతీసింది. బ్యాటరీ విద్యుత్‌ స్టోరేజీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా గుజరాత్‌లోని ఖావ్డాలో 1,126 మెగావాట్లు/3,530 మెగావాట్‌అవర్‌ (ఎండబ్ల్యూహెచ్‌) సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్‌ఎస్‌)ను నెలకొల్పనున్నట్లు పేర్కొంది.

ఇది ప్రపంచంలోనే భారీ స్టోరేజ్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా, భారత్‌లో అతిపెద్ద కేంద్రంగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్టోరేజ్‌ కేంద్రంలో 700కు పైగా బీఈఎస్‌ఎస్‌ కంటెయినర్లు ఉంటాయని, మొత్తం ప్రాజెక్ట్‌ 2026 మార్చి నాటికి సిద్ధమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఇదే చోట నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక  విద్యుత్‌ ప్లాంట్‌ సముదాయంలో భాగంగానే తాజా ప్రాజెక్టును అదానీ చేపడుతోంది. 

బ్యాకప్‌ అవసరాలకు... 
రెన్యూవబుల్‌ విద్యుత్‌ను మరింత నమ్మకమైన ఇంధన వనరుగా ఉపయోగించుకోవడంతో పాటు బ్యాకప్‌ పవర్‌ను అందించడానికి, గ్రిడ్‌ స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి బ్యాటరీ స్టోరేజ్‌ చాలా అవసరం. సౌర, పవన తదితర వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నిల్వ చేసి, అవి అందుబాటులో లేని సమయాల్లో, అంటే రాత్రి పూట లేదా తక్కువ గాలి వేగం ఉండే సమయాల్లో ఉపయోగించుకోవడానికి బ్యాటరీ స్టోరేజ్‌ వీలు కల్పిస్తుంది. దీనివల్ల గ్రిడ్‌పై, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది, అదేవిధంగా కరెంట్‌ బిల్లులు తగ్గడంతో పాటు నిరంతర విద్యుత్‌ సరఫరాకు తోడ్పడుతుంది.

’గ్రిడ్‌పై మరింత విశ్వాసం పెంచడంతో పాటు, పీక్‌ లోడ్‌ ఒత్తిళ్లను తగ్గించడం, సరఫరాపరమైన సమస్యలకు చెక్‌ పెట్టడం, రోజంతా పర్యావరణహిత విద్యుత్‌ అందించడాన్ని ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. మరింత మెరుగైన పనితీరు కోసం విద్యుత్‌ నిర్వహణ వ్యవస్థలతో అనుసంధానించిన అధునాతన లిథియం–అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీని ఇందులో వినియోగించడం జరుగుతుంది’ అని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఈ బీఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టులో 3,530 ఎండబ్ల్యూహెచ్‌ విద్యుత్‌ను నిల్వ చేయగలుగుతారు, అంటే 1,126 మెగావాట్ల విద్యుత్‌ను 3 గంటల పాటు సరఫరా చేయడానికి వీలవుతుంది. కాగా, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 15 జీడబ్ల్యూహెచ్‌కు, ఐదేళ్లలో 50 జీడబ్ల్యూహెచ్‌కు పెంచే ప్రణాళికల్లో ఉన్నట్లు అదానీ గ్రూప్‌ పేర్కొంది.

చరిత్రాత్మక ప్రాజెక్ట్‌... 
పునరుత్పాదక విద్యుత్‌ భవిష్యత్తుకు ఎనర్జీ స్టోరేజ్‌ అత్యంత కీలకమైనది. ఈ చరిత్రాత్మక ప్రాజెక్ట్‌ అనేది ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా భారతదేశ ఇంధన అవసరాలు, పునరుత్పాదక విద్యుత్‌ విషయంలో మన నిబద్ధతను మరింత చాటి చెబుతుంది.     – గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement