టర్మ్‌ ప్లాన్‌ సమగ్రంగా ఉండాలి..!  | 46percent women prefer term insurance to secure child financial future | Sakshi
Sakshi News home page

టర్మ్‌ ప్లాన్‌ సమగ్రంగా ఉండాలి..! 

Jun 20 2025 6:21 AM | Updated on Jun 20 2025 9:30 AM

46percent women prefer term insurance to secure child financial future

పిల్లల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న తల్లులు 

వారి భవిష్యత్తుకు భరోసా ఉండాలన్న ఆకాంక్ష 

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవరేజీ పట్ల అధిక ఆసక్తి 

బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ సర్వేలో వెల్లడి 

పుణె: మహిళల ఆర్థిక ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నట్టు బజాజ్‌ అలియాన్జ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన ‘‘ఉమెన్‌ టర్మ్‌ సర్వే 2025’’లో వెల్లడైంది. పిల్లల భవిష్యత్తు, వారి విద్య, ఆరోగ్య పరిరక్షణకు వారు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి విషయంలో ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. పిల్లల భద్రత దృష్ట్యా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది.

 ముఖ్యంగా, 53 శాతం మహిళలు అనుకోని వైద్య ఖర్చులు తమ కుటుంబ పొదుపులపై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు. అందుకే 87 శాతం మహిళలు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌’ను అత్యంత అవసరంగా భావిస్తున్నారు. అంతేగాక, 50 శాతం మంది మహిళలు టర్మ్‌ ప్లాన్‌లో ఆరోగ్య సేవలు కూడా ఉండాలని సర్వేలో తెలిపారు. దీనికితోడు తమకు ఏదైనా జరగరానిది జరిగితే పిల్లల విద్యా అవసరాలను తీర్చే రక్షణ కూడా టర్మ్‌ ప్లాన్లలో భాగంగా ఉండాలని మహిళలు భావిస్తున్నారు.  

సర్వేలో ముఖ్యాంశాలు 
→ ఏవైనా ఊహించని పరిస్థితులు ఎరురైతే పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని 61 శాతం మంది మహిళలు భావిస్తున్నారు. 
→ 61 శాతం మంది ఆదాయ స్థిరత్వానికి, 53 శాతం మంది వైద్య వ్యయాలకు, 54 శాతం మందికి రిటైర్మెంట్‌ ప్రణాళిక, 57 శాతం మంది మహిళలు విద్యకు తొలి ప్రాధాన్యమని సర్వేలో చెప్పారు.   
→ 46 శాతం మంది మహిళలు పిల్లల భవిష్యత్‌ భద్రత కోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  
→ 87 శాతం మహిళలు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ను అత్యవసరంగా భావిస్తున్నారు. 
→ 93 మంది టర్మ్‌ ప్లాన్‌లో ‘పిల్లలకు ఆదాయ భద్రత’ సదుపాయాన్ని ఆకర్షణీయంగా చూస్తున్నారు. 
→ 51 శాతం మహిళలు జీవిత బీమా కవరేజీ పెంచుకునే సదుపాయాన్ని కోరుకుంటున్నారు.  
→ 33 శాతం పిల్లల విద్యా భవిష్యత్తుకు సంబంధించిన ప్రయోజనాలు టర్మ్‌ ప్లాన్‌లో తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నారు.  
→ బీమా కవరేజీని సవరించుకునే సౌలభ్యం లేకపోవడాన్ని లోపంగా చూస్తున్నారు.  

సమగ్ర పరిష్కారంగా చూస్తున్నారు.. 
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను కేవలం జీవిత బీమా రక్షణగానే మహిళలు చూడడం లేదని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. తమ ఆర్థిక ప్రాధాన్యతలకు సరితూగే సమగ్రమైన పరిష్కారంగా చూస్తున్నారు. మహిళల అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను ఆవిష్కరించే దిశగా ఈ సర్వే ఫలితాలు మాకు ప్రేరణనిస్తాయి.     – తరుణ్‌ ఛుగ్, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో 

Advertisement
 
Advertisement
Advertisement