50 ఏళ్లు పూర్తి
1976లో ఇక్కడ కేఎస్‌ఎం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తి
ఉత్సవాలకు తరలిరానున్న పూర్వ విద్యార్థులు
వర్సిటీకి తోడ్పాటునందించే దిశలో సమాలోచనలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: డాక్టర్ మన్మోహన్‌సింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌గా అప్‌గ్రేడైన.. ఒకనాటి కేఎస్‌ఎం (కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్) స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. గత 50 ఏళ్ల కాలంలో ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు శనివారం కలుసుకోనున్నారు. తమ ప్రతిభకు సానబట్టిన కాలేజీకి తమవంతు మెరుగులు అద్దెందుకు సిద్ధమవుతున్నారు.
యూనివర్సిటీగా అప్‌గ్రేడ్
తెలంగాణ వచ్చాక 2018లో కేఎస్‌ఎంను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. నిపుణుల కమిటీ పరిశీలించినా అడుగులు ముందుకు పడలేదు. మరోవైపు ఇంజనీరింగ్ క్యాంపస్‌కు చెందిన 100 ఎకరాల స్థలాన్ని నూతన కలెక్టరేట్ (ఐడీఓసీ), ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కోసం కేటాయించాల్సి వచ్చింది. రోజురోజుకూ కాలేజీ ప్రాభవం కోల్పోవడం మొదలైంది. ఈ తరుణంలో దేశంలోనే తొలిసారిగా ఎర్త్ సైన్సెస్ కోర్సులు అందించే లక్ష్యంతో డాక్టర్ మన్మోహన్‌సింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌గా 2025 డిసెంబర్ 4న అప్‌గ్రేడ్ చేశారు. బ్యాచ్‌లర్స్‌లో నాలుగు కోర్సులు, మాస్టర్స్‌లో రెండు కోర్సులతో యూనివర్సిటీ మొదలైంది.
జాతీయస్థాయి సదస్సు
కొత్తగూడెంలో మైనింగ్ విద్య ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం స్వర్ణోత్సవాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ‘పూర్వ విద్యార్థులు – విద్యాసంస్థలు – పరిశ్రమల భాగస్వామ్యం’ అనే అంశంపై జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల మైనింగ్ ఇంజినీర్ల పూర్వ విద్యార్థుల సంఘం, మైనింగ్ ఇంజినీర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఈఏఐ), సింగరేణి చాప్టర్‌లు సహకారం అందిస్తున్నాయి.
సవాళ్లను ఎదుర్కొనేలా..
కేఎస్‌ఎం నుంచి మైనింగ్ ఇంజనీర్ పట్టా తీసుకున్నవారు దేశంలో అనేక మైనింగ్ సంస్థల్లో ఉన్నత పదవులు స్వీకరించారు. సింగరేణి, కోలిండియా వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు నాయకత్వం వహించడమే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ కోల్‌మైన్స్ విభాగంలోనూ కీలక బాధ్యతలను నిర్వర్తించారు. కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని పూర్వ విద్యార్థులు, విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. నేడు జరిగే సదస్సులో తమ అనుభవాలు, పరిజ్ఞానం పంచుకోవడంతోపాటు పరస్పర సహకార అవకాశాలను అన్వేషించనున్నారు.
అండాదండా..
డాక్టర్ మన్మోహన్‌సింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సమస్య వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికీ పరిపాలన పరంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి పూర్తి స్థాయిలో వేరుకాలేదు. ఫలితంగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో ఖాళీలు భారీగా ఉన్నాయి. మరోవైపు యూనివర్సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధమైనా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాక మౌలిక సదుపాయల కొరత వేధిస్తోంది. దీంతో ఇక్కడ చేరేందుకు విద్యార్థులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఉంది. ఈ సమస్యలను అధిగమించేందుకు సింగరేణి, నవభారత్, కోలిండియా, టీజీఎండీసీ వంటి సంస్థల నుంచి నిధులు రాబట్టడం, పూర్వ విద్యార్థుల నుంచి ఆర్థిక సహకారంతోపాటు బోధన, పరిపాలన పరమైన మద్దతును ప్రభుత్వం ఆశిస్తోంది. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ఈ సమస్యలకు కొంతైనా పరిష్కారం లభిస్తుందనే ఆశలు రేకెత్తుతున్నాయి.
కొత్తగూడెంలో బొగ్గు గనుల ఉండటంతో 1976 నవంబర్ 21న ఉస్మానియా క్యాంపస్‌లోని మైనింగ్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఇక్కడకు తరలించారు. కొత్తగూడెం – పాల్వంచ పట్టణాల మధ్య 420 ఎకరాల స్థలంలో కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ (కేఎస్‌ఎం) పేరుతో కళాశాల ప్రారంభించారు. 30 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీకీ బదిలీ చేశారు. అదే సమయంలో కొత్తగా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌లను ప్రారంభించారు. అనంతర కాలంలో ఐటీ, ఈఈఈ, సివిల్స్‌తోపాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు.
మన్మోహన్‌సింగ్ వర్సిటీలో నేడు గోల్డెన్ జూబ్లీ వేడుకలు


