● మారుతి సదనంలో దాతలకు ఘనంగా సన్మానం ● కొండగట్టు అంజన్నకు భద్రగిరి రామయ్య వస్త్రాలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అభివృద్ధికి, ఆలయంలో నిర్వహించే నిత్య, వార, పర్వదిన ఉత్సవాలకు దాతల సేవలు అభినందనీయమని ఆలయ ఈఓ దామోదర్‌రావు అన్నారు. భద్రాచలం రామాలయానికి వివిధ రూపాల్లో విరాళాలు అందిస్తూ స్వామివారి సేవలో భాగస్వాములవుతున్న దాతలకు ఏటా నిర్వహించే సన్మాన కార్యక్రమం శుక్రవారం మారుతి సదనంలో ఘనంగా జరిపారు. శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ దాతల సహకారం వల్లే ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో దాతలు, ఆలయ అర్చకులు, పండితులు, అధికారులు పాల్గొన్నారు.
కొండగట్టు అంజన్నకు భద్రగిరి రామయ్య వస్త్రాలు
కొండగట్టు ఆంజనేయస్వామికి భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం తరఫున శుక్రవారం పట్టువస్త్రాలను సమర్పించారు. ఆంజనేయస్వామికి చందనోత్సవం సందర్భంగా ఇక్కడి నుంచి బృందం కొండగట్టుకు వెళ్లి పట్టువస్త్రాలు, ప్రసాదం, సింధూరం, తాంబులాలను సమర్పించారు. ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ, ప్రధాన అర్చకుడు కోటి రామస్వరూప్, ఉప ప్రధానార్చకుడు కోటి శ్రీమన్నారాయణ, అర్చకులు సీతారాం భార్గవ, రఘు పుంగవలు పాల్గొన్నారు.
రామసేవా మండపంలో కల్యాణం
దేవస్థానంలో స్వామి వారికి నిత్య కల్యాణం వైభవోపేతంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామసేవా మండపంలో స్వావి వారి నిత్య కల్యాణమూర్తులను కొలువుదీర్చారు. క్రతువులో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.


