మణుగూరు టౌన్: పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఆహార విక్రయ కేంద్రాలు, ఆహార నిల్వ కేంద్రాలను శుక్రవారం ఆహార భద్రతా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆహార పదార్థాలను నిల్వ చేసే కంటైనర్లు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారి శరత్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. నాణ్యత లేని, గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో విక్రయించే ఆహార పదార్థాల్లో నాణ్యత, ఇతర లోపాలు ఉంటే తమ దృష్టికి తేవాలని వినియోగదారులకు సూచించారు.


