● కార్తీకమాసంలో మంచి ముహూర్తాలు ● మొదలుకానున్న శుభకార్యాలు
ఖమ్మంగాంధీచౌక్: చాతుర్మాస్యం ముగిసి కార్తీక మాసం మొదలుకావడంతో చాన్నాళ్లుగా ఆగిపోయిన శుభకార్యాల సందడి మళ్లీ ప్రారంభం కానుంది. ఈనెల 10 నుంచి డిసెంబర్ 8 వరకు కొనసాగే పవిత్ర మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. శివకేశవుల అనుగ్రహం పొందే కార్తీక మాసంలో చేసే వివాహాలకు శివపార్వతుల ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మిక. దీంతో ముహూర్తాలు ఖరారు చేస్తుండగా మండపాల నుంచి పురోహితుల వరకు, బంగారం షాపుల నుంచి డెకరేషన్ వారి వరకు బిజీ కానున్నారు.
శుభ ముహూర్తాలివే..
ఈ కార్తీక మాసంలో ముహూర్తాలు బలంగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈనెల 12 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఇందులో వివాహాలకు ఈనెల 12, 15, 18, 20, 21, 22, 25, 26వ తేదీలతో పాటు డిసెంబర్ నెలలో 2, 3వ తేదీలు అనువుగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ఈనెల 20, 21, 25, 26వ తేదీలతో పాటు డిసెంబర్ 2, 3వ తేదీలను పెళ్లిళ్లకు బలమైన ముహూర్తంగా చెబుతుండడంతో ఆయా రోజుల్లో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఇక ఈనెల 15, 20, 21, 22, 25, 26వ తేదీల్లో గృహప్రవేశం, శంకుస్థాపన, నిశ్చితార్థానికి మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.


