నెల రోజుల తర్వాత
వరుస ఘటనలు
మంత్రగాళ్ల నెపంతో ఇద్దరి దారుణ హత్య నెల తర్వాత వెలుగులోకి అమానవీయ ఘటన ఆళ్లపల్లి మండలంలో ఏడాది వ్యవధిలో మూడో ఘటన
సాక్షి భద్రాద్రి కొత్తగూడెం: సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంతటా వ్యాపిస్తున్న వేళ జిల్లాలోని అడవుల్లో ఇప్పటికీ అనాగరిక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మంత్రగాళ్లనే ముద్ర వేసి దారుణ హత్యలకు పాల్పడే పద్ధతి ఇంకా కొనసాగుతోందని ఈ ఘటన ద్వారా బయటపడుతోంది. ప్రధానంగా ఆదివాసీ, గిరిజన గూడేలు ఈ తరహా దాడులకు కేరాఫ్‌గా మారాయి.
అదే రోజు హత్య
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మడకం భీమయ్యకు వెజ్జోడుగా గొత్తికోయ తెగలో పేరుంది. వెజ్జోడు అంటే గొత్తికోయ ఆదివాసీ తెగలకు సంబంధించిన భూతవైద్యుడు. జ్వరం, జలుబు, ఒంటి నొప్పులు వంటి సమస్యలకు ఆకు పసరు, మూలికా వైద్యం చేయడంతో పాటు గాలి, ధూళి సోకడం వంటి మూఢ విశ్వాసాలు నమ్మేవారు ఆయనతో పూజలు చేయించుకుంటారు. ఈ క్రమంలోనే మణుగూరు మండలం బూడుగుల గ్రామానికి చెందిన పదం రాంబాబు కుటుంబ సభ్యులకు గాలి సోకిందని భావిస్తూ ఆయన ఇంటికి భీమయ్యను పదం మాసయ్య తీసుకొచ్చాడు. అదేరోజు మధ్యాహ్నం వరకు ఇంట్లో పూజలు చేశారు. ఆ తర్వాత భీమయ్య ఇంటికి బయలుదేరగా మాసయ్య తోడుగా వెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరి జాడ కనిపించడం లేదు.
మంత్రాల భయంతో
గాలి, ధూళి సోకిదంటూ తరచూ వెజ్జోడుగా పేరున్న భీమయ్యను తమ గ్రామానికి పదం మాసయ్య తీసుకొస్తుండడం స్థానికులకు నచ్చలేదని తెలుస్తోంది. అంతేకాక పలువురు వారి కుటుంబీకుల అనారోగ్యానికి మాసయ్య, భీమయ్యలే కారణమనే అనుమానాలు పెరిగాయి. దీంతో గతనెల 7న పూజలు చేసి ఆళ్లపల్లి మండలం బుస్సాయిగూడెంకు వెళ్తున్న వీరిపై మార్గమధ్యలో బూడుగుల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. కర్రలతో విపరీతంగా కొట్టగా వృద్ధులైన వారు తట్టుకోలేక అక్కడిక్కడే చనిపోయారు. ఆపై మృతదేహాలను జోలెలో కట్టుకుని అదే దారిలో మరో మూడున్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించి మల్లేపల్లి తోగు దగ్గర చెక్‌డ్యామ్ సమీపంలో గొయ్యి తవ్వి పాతి పెట్టారు. గోతులు బయటకు కనిపించడకుండా చెట్లను కొట్టి కొమ్మలను వాటిపై వేశారు. తండ్రి జాడ కోసం నందిని వెతుకుతున్న క్రమాన.. ఆళ్లపల్లి నుంచి మణుగూరు దారిలో భీమయ్య వాడిన వాటర్ బాటిల్, బియ్యం సంచి, దారి వెంట బియ్యం పడిన ఆనవాళ్లు కనిపించడంతో దారుణం జరిగినట్టు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మంగళవారం విచారణ చేపట్టిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. ఈ జంట హత్యలకు కారణమైన ఐదుగురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
క్షుద్ర పూజల చిత్రం (ఏఐ)
మణుగూరు మండలం బుగ్గ గ్రామపంచాయతీ పరిధి బూడుగుల గ్రామంలో 30కి పైగా గొత్తికోయ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇందులో పదం మాసయ్య(70).. ఆళ్లపల్లి మండలం బుస్సాయిగూడెంకు చెందిన మడకం భీమయ్య (80)ను గతనెల 7న తన గ్రామానికి ఆహ్వానించాడు. అప్పటి నుంచి వీరిద్దరు కానరాకుండా పోయారు. దీంతో భీమయ్య కుమార్తె ఎట్టి నందిని తండ్రి ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది. ఈక్రమాన భీమయ్య, పదం మాసయ్యను మంత్రగాళ్లనే నెపంతో తీవ్రంగా కొట్టి చంపివేశారని తెలిసింది. దీంతో సోమవారం ఆమె మణుగూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో మంగళవారం ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు పాతిపెట్టిన మృతదేహాలను వెలికి తీశారు.
చేతబడి అనుమానంతో ఆళ్లపల్లి మండలం బూసరాయికి చెందిన మడకం రాజును గత ఏడాది ఆగస్టు 8న కర్రలతో కొట్టి చంపారు.
ఆళ్లపల్లి మండలం మర్కోడు మండలం జల్లేరు వాగు దగ్గర మంత్రాల నెపంతో స్థానికులు దాడి చేయడంతో పూనెం నారాయణ అలియాస్ రామనాథం(57) ఈ ఏడాది సెప్టెంబర్ 17న హత్యకు గురయ్యాడు.
బూర్గంపాడు మండలం జింకలగూడెంలో భూతవైద్యం పేరుతో ఓ వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి కొట్టిన వీడియోలు సెప్టెంబర్ 21న వెలుగులోకి వచ్చాయి.
గిరిజన, గొత్తికోయలను వీడని మూఢనమ్మకాలు


