● పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ● హెచ్‌ఎంలు, వార్డెన్లతో సమీక్షలో ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ పరిధి ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల పోస్ట్‌మెట్రిక్, ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని ఏటీడీఓలు, హెచ్‌ఎంలు, వార్డెన్లతో మంగళవారం సమావేశమైన పీఓ మాట్లాడుతూ డైట్, కాస్మోటిక్ చార్జీలు, ఇతర బిల్లుల దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి విద్యార్థుల ఖాతాల్లో సకాలంలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ, సరుకుల నాణ్యత పరిశీలనపై సూచనలు చేశారు. అంతేకాక పదో తరగతి విద్యార్థుల్లో వెనుకబడిన వారిని గుర్తించడంతో పాటు ఉద్దీపకం వర్క్‌బుక్–3, వారధి పుస్తకంలోని పోటీ పరీక్షల అంశాలను బోధించాలని సూచించారు. బాలికల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని పీఓ ఆదేశించారు. పీఎంహెచ్ కళాశాలల విద్యార్థులు 4,800 మంది స్కాలర్‌షిప్ దరఖాస్తులు పెండింగ్ ఉన్నందున అవసరమైన ప్రక్రియ ఈనెల 20 నాటికి పూర్తిచేయించాలని తెలిపారు. ఈ సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన, ఏటీడీఓలు చంద్రమోహన్, రాధమ్మ, భారతీదేవి, ఇన్‌చార్జ్ ఏఓ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో
గిరిజన విద్యార్థులు రాణించాలి
గిరిజన విద్యార్థులు చదువుతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన పెంపొందించుకొని పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. జన్ జాతీయ గౌరవ్ దివస్ వేడుకల్లో భాగంగా ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో గిరిజన విద్యార్థులకు హైదరాబాద్‌కు చెందిన సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సహకారంతో ఏర్పాటుచేసిన శాసీ్త్రయ అవగాహన సదస్సును పీఓ ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలు డాక్టర్ సురేందర్ సింగ్ జాదవ్, డాక్టర్ ఆరాధన ప్రియదర్శిని, డాక్టర్ బానోతు లింగ, డాక్టర్ సి.చంద్రశేఖర్, సీనియర్ రీసెర్చ్ స్కాలర్ పి.రవీంద్రరెడ్డి శాసీ్త్రయ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య ద్వారా లభించే అవకాశాలను వివరించారు. అనంతరం శాస్త్రవేత్తలతో విద్యార్థులు ముఖాముఖి చర్చల్లో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అలాగే, వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఏపీఓ(జనరల్) డేవిడ్ రాజ్, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.


