భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి స్వామివా రికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. అలాగే, స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
రూ.1.14లక్షల విలువైన
రబ్బర్ కార్పెట్లు వితరణ
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ.1.14 లక్షల విలువైన రబ్బర్ కార్పెట్లను హైదరాబాద్ వాసులు మంగళవారం వితరణగా అందచేశారు. హైదరాబాద్‌లోని ఒయాసిస్ ఆస్పత్రి వైద్యులు కృష్ణ చైతన్య – హరిత దంపతులు వారి స్నేహితుల సహకారంతో కార్పెట్లను ఆలయ ఈఓ దామోదర్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రబ్బర్ కార్పెట్లు నిత్య కల్యాణ మండపం ప్రాంగణంలో భక్తులకు ఉపయోగపడతాయని తెలిపారు. ఆలయ ఏఈఓ శ్రావణ్‌కుమార్, అనిల్‌కుమార్, స్థానికులు గొర్ల వెంకటేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా
బేతంపూడి ప్రాజెక్టు
పరిశీలించిన డీపీఓ అనూష
టేకులపల్లి/టేకులపల్లి రూరల్: మండలంలోని బేతంపూడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించినట్లు జిల్లా పంచాయతీ అధికారి, ఇన్‌చార్జ్ టూరిజం, యువజన క్రీడల శాఖాధికారి బి.అనూష వెల్లడించారు. ఈమేరకు ఆమె మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యాటక అభివృద్ధి ఉన్న అవకాశాలు, కల్పించాల్సిన వసతులపై చర్చించారు. తొలుత డీపీఓ బేతంపూడి జిల్లా పరిషత్ పాఠశాల, బేతంపూడితో పాటు శంభుని గూడెం, చంద్రుతండా జీపీలను తనిఖీ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూ పై ఆరా తీసిన ఆమె గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ కొండపల్లి శ్రీదేవి, ఎంపీఓ దండ్యాల రామారావు, ఏపీఓ కళంజి శ్రీనివాస్, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
విద్యార్థుల నైపుణ్యాలకు పదును పెట్టాలి
డీఈఓ శంభుప్రసాద్
టేకులపల్లి: మండలంలోని సులానగర్ జెడ్పీ హైస్కూల్, కోయగూడెం, హనుమతండా ఎంపీయూపీఎస్‌ల్లో డీఈఓ శంభుప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. హనుమా తండా పాఠశాలలో విద్యార్థుల అభ్యసనా స్థాయి మెరుగ్గా ఉండడంతో ఉపాధ్యాయుడు బి.రమేష్‌బాబును అభినందించారు. అయితే, పిల్లల నైపుణ్యాలకు మరింత పదును పెట్టేలా వర్క్ బుక్(అభ్యసన దీపిక)లతో సాధన చేయించాలని సూచించారు. హెచ్‌ఎం లక్ష్మయ్య, ఉద్యోగులు సునీల్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
రేక్ పాయింట్‌కు
కాంప్లెక్స్ ఎరువులు
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు మంగళవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన కాంప్లెక్స్ ఎరువులు చేరాయి. ఇందులో డీఏపీ 1,209.80 మెట్రిక్ టన్నులు, పొటాష్ 127.70 మెట్రిక్ టన్నులు ఉన్నాయని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్ల య్య తెలిపారు. వీటిని కోటా వారీగా ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాకు చేరవేసినట్లు వెల్లడించారు.


