ప్లాన్ మార్చారు
మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండటంతో రవాణాకు కలిసొస్తున్న వైనం
దండకారణ్య అటవీ సంపదపై అక్రమార్కుల కన్ను
అల్లి చెట్టు వేర్ల దందాతో
గ్రౌండ్ ప్రిపేర్‌కు స్కెచ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిన్నామొన్నటి వరకు తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడేనికి పేరుండేది. కానీ, రాబోయే రోజుల్లో కలప, గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మార్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధమవుతోంది. పోలీసు నిఘా, అటవీశాఖ తనిఖీల్లో వాడీవేడి తగ్గడంతో అక్రమార్కులు పంజా విసిరేందుకు సిద్ధమవుతున్నారు.
మరింత సరుకు
అక్రమ పద్ధతిలో అల్లి చెట్టు వేర్లు (ఐరన్ ఉడ్) జిల్లా మీదుగా రవాణా అవుతున్నాయి. ఇప్పటికే పన్నెండు టన్నుల సరుకు జిల్లా దాటి ఏపీ మీదుగా తమిళనాడులోకి వెళ్లిపోయింది. రేపో మాపో జిల్లాలోకి వచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో మరో ఏడు టన్నుల సరుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. సుక్మా జిల్లాలోని ధర్మపేట, ఎర్రమామిడి, మారాయిగూడెం, పాలోడి, కిష్టారంతోపాటు బీజాపూర్ జిల్లాలోని పామేడు, ఊసూరు, ధర్మారం గ్రామాల్లో అల్లి చెట్ల వేర్ల నిల్వలు భారీగా ఉన్నాయి. వాటిని ముందుగా జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని స్థావరాలకు తరలించి, అక్కడి నుంచి అదును చూసుకుని రాష్ట్ర సరిహద్దులు దాటించనున్నారు.
కీలక స్థానంలో
జిల్లా ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లతో సరిహద్దును పంచుకుంటోంది. ఒడిశా సైతం సమీపంలోనే ఉంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీలలో సరిహద్దు జిల్లాలుగా ఉన్న బీజాపూర్, సుక్మా, మల్కన్‌గిరి, పోలవరం, అల్లూరి జిల్లాల్లో దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. గోదావరి, శబరి, సీలేరు నదులు ప్రవహించే ఈ ప్రాంతంలో ఒకే రకమైన భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. పొరుగు రాష్ట్రాల్లోని చిక్కటి అడవులు విస్తరించిన ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు రావడానికి జిల్లా గేట్ వేగా ఉంది. దీంతో స్మగ్లర్లు జిల్లాపై కన్నేశారు. మావోయిస్టుల ప్రభావం తగ్గాక దక్షిణ బస్తర్, ఏఓబీ ప్రాంతాల నుంచి గంజాయి, కలప అక్రమ రవాణాకు జిల్లానే ఎంచుకుంటున్నారు.
ఒక్కొక్కటిగా చక్కబెడుతూ
పెద్దగా అనుమానం రాకుండా అల్లిచెట్ల వేర్లను స్థానిక గిరిజనుల ద్వారా సేకరిస్తున్నారు. వాటిని భద్రపరించేందుకు అనువుగా స్థానిక గ్రామాల్లోని కొందరిని మచ్చిక చేసుకుంటున్నారు. పోగేసిన వేర్లతో ట్రక్ వెళ్లే రూట్, ఆ దారిలో వచ్చే చెక్‌పోస్టులు, అక్కడ తీసుకోవాల్సిన ‘జాగ్రత్తలు’ తదితర వ్యవహారాలు చక్కబెట్టే పనిని ప్రస్తుతం చాపకింద నీరులా చేస్తున్నారు. ఏడాది క్రితం ఈ ప్రణాళిక తెర మీదకు తీసుకురాగా గడిచిన ఆరు నెలలుగా వేర్ల అక్రమ రవాణా సాగిపోతోంది. ఆరంభంలో పత్తి బేళ్ల కింద వేర్లను సరఫరా చేశారు. ఆ తర్వాత దారి మధ్యలో వచ్చే సర్కారు తనిఖీలను తప్పించే ఉపాయం దొరకడంతో ప్రస్తుతం పత్తి బేళ్లు, ఇతర కవరింగులు అవసరం లేకుండానే ట్రక్కులు సాఫీగా సాగిపోతున్నాయి. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఈ దందాతో సంబంధం ఉన్న వ్యక్తులు కేవలం ఆరు నెలల వ్యవధిలోనే లక్షాధికారులు కావడం, ఎడాపెడా ఆస్తులు కూడబెడుతుండటం ఈ మాఫియా ఎదుగుతున్న తీరుకు అద్దం పడుతోంది. రాబోయే రోజుల్లో మరింత మందిని ఈ అక్రమ వ్యాపారం వైపు ఆకర్షించి అల్లి వేర్ల నుంచి క్రమంగా గంజాయి, టేకు కలప అక్రమ రవాణా చేయడం ఇక్కడి అక్రమార్కల అసలు లక్ష్యంగా ఉంది.
గడిచిన నాలుగేళ్లలో జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టడంతో ఇటీవల నిఘా పెరిగింది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు విరివిగా పట్టుబడుతున్నాయి. దీంతో గంజాయి ముఠాలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మావోయిస్టుల ప్రభావం కూడా తగ్గడంతో మరోసారి దండకారణ్యంలోని విలువైన కలపను అక్రమంగా తరలించే మాఫియా సిద్ధమైంది. అయితే, కలప దందాకు వీలుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆకలింపు చేసుకునే క్రమంలో ముందుగా అల్లిచెట్ల వేర్ల దందాను తెరపైకి తెచ్చింది.
జిల్లా మీదుగా కలప స్మగ్లింగ్‌కు మాఫియా ప్లాన్


