భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కనుల పండువగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామసేవా మండపంలో కొలువుదీర్చి నిత్యకల్యాణ మూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్య కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
నేటి నుంచి బొగ్గు నాణ్యత వారోత్సవాలు
రుద్రంపూర్: సింగరేణిలో ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు క్వాలిటీ విభాగం ఆధ్వర్యంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహించనున్నారు. ‘వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తి, వినియోగదారుడి సంతృప్తి’అనే నినాదంతో ఉత్సవాలు జరపనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 12న కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ప్రారంభించనుండగా, సంస్థవ్యాప్తంగా నాణ్యతపై పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
21న ప్రత్యేక
లోక్ అదాలత్
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 21న చెక్ బౌన్స్ (ఎన్‌ఐ యాక్ట్) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రధాన జిల్లా న్యాయమూర్తి జి. ప్రేమలత, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ బుధవారం ఒక ప్రకటన తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను ఇరువర్గాల రాజీ మార్గం ద్వారా వేగంగా పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో లభించే తీర్పుకు సివిల్ కోర్టు డిక్రీతో సమానమైన ప్రాధాన్యత ఉంటుందని, దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని వివరించారు.
రైల్వే ఆస్పత్రిలో
సీఎండీ తనిఖీలు
కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌ను బుధవారం రైల్వే సీఎండీ నిర్మల సందర్శించారు. జనరల్ విజిల్‌లో భాగంగా ఆమె బీడీసీఆర్ రైల్వే ఆస్పత్రిని పరిశీలించారు. రానున్న పుష్కరాల సందర్భంగా రైల్వే ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యం, మందులు, సిబ్బంది తదతర విషయాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
దర్యాప్తు వేగవంతం చేయాలి
భద్రాచలంటౌన్: పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశించారు. భద్రాచలం పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన విచారణతో కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. డీఎస్పీ అరుణ్ కుమార్, సీఐ సట్ల రాజు, ఎస్‌ఐలు రామకృష్ణ, కేశవ్ సిబ్బంది పాల్గొన్నారు.


