కొత్తగూడెంఅర్బన్: భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, వివాదాలకు తావులేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో భూముల రీసర్వే ప్రక్రియపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
పంటల సాగుపై ముందస్తు ప్రణాళిక
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, లోటు వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు ప్రణాళికతో పలు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అంకిత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూగర్భ జలాల లభ్యత, సాగునీటి వనరుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో రైతులు పంటల సాగులో తగిన మార్పులు చేసుకునేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నీటి వినియోగం అధికంగా ఉండే వరి సాగును తగ్గించి, నీటి లభ్యతకు అనుగుణంగా ఆరుతడి పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని సూచించారు. గత సీజన్‌తో పోలిస్తే సాగు విస్తీర్ణం సుమారు 31 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. గతంలో 89,348 ఎకరాల్లో సాగైన వరి పంటను ఈ సీజన్‌లో 29,300 ఎకరాలకు పరిమితం చేయాలనే అంచనాతో చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
నీటి కొరతను అధిగమించాలి
మణుగూరు రూరల్ : ఎల్‌నినో ప్రభావ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో నీటి కొరతను అధిగమించాలని, వరి సాగుకు దూరంగా ఉండాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జి.బాబూ రావు సూచించారు. బుధవారం మణుగూరు మండలంలోని చినరాయిగూడెం, అనంతారం గ్రామాలను సందర్శించారు. రైతులతో సమావేశమై పంటల సాగుపై పలు సూచనలు చేశారు. తక్కువ నీటితో సాగయ్యే అపరాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఏఓ వి.రాహుల్‌రెడ్డి, ఏఈఓ కొమరం లక్ష్మణ్‌రావు, రైతులు కె.గాదె రాజు, కె.రామారావు, కె.భద్రయ్య, ఎం.మంగయ్య, నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి


