శ్రీరామనవమి నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
రూ.348.59 కోట్లతో ఘాట్లు, ఆలయ పరిసరాల అభివృద్ధి
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
పెద్దమ్మతల్లి అమ్మవారి సేవలో..
భద్రాచలం: రానున్న గోదావరి పుష్కరాలకు భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం భద్రాచలంలో పర్యటించిన ఆమె శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు, గోదావరి నది తీరంలో నిర్మిస్తున్న నూతన పుష్కర ఘాట్ పనులను పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు, కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనుల పురోగతి, పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించారు. దేశవిదేశాల నుంచి భద్రాచలానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతోపాటు ఘాట్ల వద్ద సురక్షితమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సమన్వయం ఉండాలి
తాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ, వైద్య సేవలు, భద్రత, రవాణా, అగ్నిమాపక ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలన్నారు. పుష్కరవనం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించాలన్నారు. భక్తుల బస కోసం డార్మెటరీలను సిద్ధం చేయాలన్నారు. దేవస్థానం అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.348.59 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. శ్రీరామనవమి నాటికి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం చేయగా, ఈఓ దామోదర్‌రావు స్వామి వారి ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో దేవస్థానం ఈఓ దామోదర్ రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ నాగేశ్వరరావు, డీపీఓ అనూష, ట్రాన్స్‌కో ఎస్‌ఈ మహేందర్, డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్, డీఏఓ భగవాన్‌రెడ్డి, తహసీల్దార్ రవికుమార్, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖ రాష్ట్ర కమిషనర్ ఎం.హనుమంతరావు బుధవారం సందర్శించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ విజయ్‌కుమార్ అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను కమిషనర్‌కు అందజేశారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించిన కమిషనర్ దేవాలయ అభివృద్ధిపై ఆరా తీశారు. సిబ్బంది, అర్చకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవాదాయశాఖ అధికారులు వీరస్వామి, శేషయ్య పాల్గొన్నారు.


