పాల్వంచ: పాల్వంచ మార్కెట్‌లో ఆదివారం తూనికల, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. లీగల్ మెట్రాలజీ అధికారి కె.సుభాష్ ఆధ్వర్యాన తనిఖీలు జరగగా, నిబంధనలు ఉల్లంఘించిన 12 మంది వ్యాపారులపై కేసు నమోదు చేశారు. ఆరు చికెన్ షాపులు, ఇద్దరు చేపల అమ్మకందారులు, మూడు కూరగాయల షాపులు, ఒక కిరాణం షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేయడమే కాక ముద్ర వేయించని కాంటాలు,ఒక ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నారు.
గోదావరిలో
కొనసాగుతున్న నిమజ్జనం
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గోదావరి నదిలో గణపతి విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాలను భక్తులు తీసుకొస్తున్నారు. అయితే, ఒకే లాంచీ అందుబాటులో ఉండడం, సిబ్బందిని కూడా సరిపడా నియమించపోవడంతో నిమజ్జనం కొంత నెమ్మదిగా సాగుతోంది. అందుబాటులో ఉన్న వనరులతోనే అధికారులు విగ్రహాల తరలింపు, నిమజ్జనం, ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమయ్యారు. పూర్తిస్థాయిలో నిమజ్జనం పూర్తవడానికి మరో రెండు రోజుల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.
సంజ్ఞా భాషకు గుర్తింపు, ప్రచారం కల్పించాలి
ఖమ్మంమయూరిసెంటర్: బధిరులపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడి సంక్షేమంపై దృష్టి సారించాలని బధిరుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్, రామకృష్ణ కోరారు. ప్రపంచ సంజ్ఞా భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన బధిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం సంజ్ఞా భాషను గుర్తించి తగిన ప్రచారం కల్పించాలని కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో సంజ్ఞా భాషపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో విరివిగా వాడేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరస్వామి, మహేష్, సరిత, సాయికుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బధిరుల హక్కులు, సంజ్ఞా భాష ప్రాముఖ్యతపై జయరాం, ప్రభాకర్ ప్రసంగించారు.
బిడ్డను చూడకుండానే కన్నుమూత
సూపర్‌బజార్(కొత్తగూడెం)/డోర్నకల్: తండ్రి మృతి చెందాక కుటుంబానికి అండగా నిలుస్తున్న యువకుడు కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం భార్య ఆరు నెలల గర్భవతి. ఈక్రమాన స్నేహితులతో ఉత్సాహంగా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాక స్నేహితులతో కలిసి మున్నేటి వద్దకు వెళ్లిన ఆ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధి తిలక్‌నగర్‌కు చెందిన గడ్డం మధు(23) అలియాస్ బాలరాజు గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాక స్నేహితులైన భార్గవ్, రాహుల్, పర్వేష్‌తో కలిసి శనివారం రాత్రి కారులో కారేపల్లి మండలం కమలాపురంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఆదివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగు వద్దకు వెళ్లారు. మున్నేటి ఆనకట్టలో నిండా నీరు ఉండడంతో మధు ఈత కొడతానని దిగగా లోతు ప్రాంతంతో ఆయన మునిగిపోతుండడంతో స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ చంద్రమౌళి, ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకుని మత్స్యకారుల సాయంతో మధు మృతదేహాన్ని బయటకు తీశారు. బాలరాజు తండ్రి రుద్రంపూర్ జీపీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆతర్వాత తల్లి, చెల్లితో కలిసి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకోగా, ఆయన భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. సీలింగ్, డోర్ ఫిట్టింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే బాలరాజు మృతి సమాచారం తెలియడంతో భార్యతో పాటు కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


