రోడ్డు భద్రతకు కొత్త వ్యవస్థ | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతకు కొత్త వ్యవస్థ

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

● ఉమ్మడి జిల్లాకు రెండు ఏఎస్పీ పోస్టులు ● ప్రతీ పీఎస్‌లో ప్రత్యేక అధికారి.. హైవేలపై పెట్రోలింగ్‌

● ఉమ్మడి జిల్లాకు రెండు ఏఎస్పీ పోస్టులు ● ప్రతీ పీఎస్‌లో ప్రత్యేక అధికారి.. హైవేలపై పెట్రోలింగ్‌

భద్రాచలంఅర్బన్‌: రోడ్డు ప్రమాదాలను ముందుగానే కట్టడి చేయడంతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రమాదం జరిగాక కేసు నమోదు, దర్యాప్తునకు పరిమితం కాకుండా.. ప్రమాద కారణాల అన్వేషణ, ఎలాంటి మార్పులు చేస్తే నివారించవచ్చో గుర్తించేలా ఇకపై దృష్టి సారించనున్నారు. ఇందుకోసం ‘తెలంగాణ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌ అండ్‌ రైల్‌ సేఫ్టీ బ్యూరో’ (టీజీ–టీఎంఏఆర్‌ఎస్‌)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈనెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాకు అదనపు ఎస్పీ(ట్రాఫిక్‌) పోస్టు మంజూరు చేయగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒక్కో అధికారిని నియమించనున్నారు. వీరి నేతృత్వాన ట్రాఫిక్‌ నిర్వహణ, రోడ్డు భద్రతా చర్యల పర్యవేక్షణ కొనసాగుతుంది.

‘గోల్డెన్‌ అవర్‌’లో వైద్యం

ప్రమాదాలపై వెంటనే స్పందించేలా ప్రతీ పోలీసుస్టేషన్‌లో ఒకరికి ‘రోడ్‌ క్రాష్‌ రెస్పాన్స్‌ ఆఫీసర్‌’ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రమాద సమాచారం తెలియగానే ఘటనాస్థలికి చేరడం, క్షతగాత్రులను ‘గోల్డెన్‌ అవర్‌’లో ఆస్పత్రికి తరలించి వైద్యం అందేలా చూడడం వీరి బాధ్యత. అంతేకాక ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరిగాయని సరిపెట్టకుండా వాహనంలో లోపం, రహదారి పరిస్థితులపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఒకేచోట తరచూ ప్రమాదాలు జరిగితే బ్లాక్‌స్పాట్‌గా గుర్తించి లోపాలను సరిచేసేలా సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లాలి. ఇక హైవేలపై నిఘా మరింత పెంచేందుకు రహదారి పరిధిలోని పోలీసుస్టేషన్ల వద్ద ప్రత్యేక పెట్రోలింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. డాష్‌బోర్డ్‌ కెమెరాలు, వాహనాల నంబర్‌ప్లేట్లను గుర్తించే పరికరాలు, స్పీడ్‌ డిటెక్టర్లు సమకూర్చడంతో పాటు అతివేగం, ఇతర ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై నిఘా పెట్టనున్నారు. ఈ వ్యవస్థ నిర్వహణకు ‘ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌’ ఏర్పాటుచేసి ట్రాఫిక్‌ జరిమానా, కాంపౌండింగ్‌ ఫీజుల నుంచి 40 శాతం మళ్లిస్తారు. ఈ నిధులతో పెట్రోలింగ్‌ వాహనాలు, సాంకేతిక పరికరాల కొనుగోలు, సిబ్బందికి శిక్షణతో పాటు అత్యవసర రోడ్డు భద్రతా పనులు చేపడతారు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బ్యూరో, జిల్లాస్థాయిలో ట్రాఫిక్‌ ఏఎస్పీ, పోలీసుస్టేషన్‌ స్థాయిలో ప్రమాద స్పందన అధికారి ఉండేలా తీసుకొస్తున్న ఈ వ్యవస్థతో ప్రమాదాలపై స్పందన మొదలు నివారణ చర్యలు ఒకే గూటి కింద కొనసాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement