మెప్పు కోసం తిప్పలు! | - | Sakshi
Sakshi News home page

మెప్పు కోసం తిప్పలు!

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

సీఎస్‌ఆర్‌ అంటే....

భద్రాద్రి జిల్లాకు మాత్రం కేటాయింపులు అంతంతే..

బుట్టదాఖలవుతున్న ఇక్కడి ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు

గతంలోనూ ఇదే తంతు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘అయిన వారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో వడ్డింపు’ అన్న చందంగా సింగరేణి వ్యవహార శైలి మారింది. వెనుకబాటు తనానికి మారుపేరుగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమానికి కేటాయించాల్సిన సీఎస్‌ఆర్‌ నిధులను రాజకీయ నేతల మెప్పు కోసం మళ్లించడం పరిపాటిగా మారింది. ఫలితంగా సింగరేణి తీరుపై స్థానిక నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి.

అడగడమే ఆలస్యం..

రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా అయిన సూర్యాపేటకు సీఎస్‌ఆర్‌ ఫండ్‌ కింద రూ.9.61 కోట్లు మంజూరు చేస్తూ సింగరేణి యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హరేకృష్ణ ఫౌండేషన్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం సమకూరుస్తుండగా, మెగా కిచెన్‌ నిర్మాణానికి సీఎస్‌ఆర్‌ నిధులు ఇవ్వాలని ఈనెల 14న మంత్రి ఉత్తమ్‌ లేఖ రాశారు. అడిగిందే తడవుగా రంగంలోకి దిగిన అధికారులు చకచకా ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి కేవలం మూడు రోజుల్లోనే 17న అనుమతించగా, 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బొగ్గు గనులు, ఇసుక రీచ్‌లు ఉన్నట్టే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పదుల సంఖ్యలో భారీ సిమెంట్‌ పరిశ్రమలు, తెలంగాణలోనే పెద్దదైన 4వేల మెగావాట్ల థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఉంది. ఆ సంస్థల నుంచి సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయిస్తున్నా సింగరేణి నుంచి నిధులు తీసుకెళ్లడం చర్చకు దారి తీసింది.

మనకై తే మొండి చేయి

కొత్తగూడెంలోని పోస్టాఫీస్‌ సెంటర్‌ నుంచి హేమచంద్రపురం రోడ్డు, సింగరేణి హెడ్డాఫీస్‌ నుంచి మెయిన్‌ హాస్పిటల్‌ రహదారుల నిర్వహణను సింగరేణి చూస్తోంది. నిత్యం వందలాది బొగ్గు లారీలు తిరుగుతుండడంతో గుంతలమయంగా మారాయి. ఈ రోడ్ల విస్తరణ, మరమ్మతుల కోసం స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలుసార్లు సింగరేణికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కొత్తగూడెంలో కొత్త బస్‌స్టేషన్‌ నిర్మాణానికి సింగరేణి నిధులు ఇవ్వాలని లేఖలు రాశారు. ఇక ఇల్లెందు ఏరియా విషయానికి వస్తే ఇక్కడ తొలి కార్మికవాడగా పేరున్న 21 ఏరియాలో రోడ్లన్నీ సింగరేణి నిర్మించినవే. గనులు మూతపడడంతో రోడ్ల నిర్వహణను సంస్థ గాలికి వదిలేసింది. కనీసం సీఎస్‌ఆర్‌ నిధులు కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా రోడ్లన్నీ ఛిద్రమై రాళ్లు తేలి ప్రజలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు కొత్తగూడెంలో ఉన్న డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీ అభివృద్ధి పనులు సైతం సింగరేణి అందించే సీఎస్‌ఆర్‌ నిధులపైనే ఆధారపడి ఉన్నాయి.

భారీ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తమ నికర లాభాల్లో నుంచి కనీసం రెండు శాతాన్ని సామాజిక బాధ్యతకు ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ(సీఆర్‌ఎస్‌) ఫండ్‌గా పరిగణిస్తారు. ఈ నిధులు ఎక్కడైనా ఇచ్చే అవకాశం ఉన్నా సాధారణంగా ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టడం పరిపాటి. ప్రధానంగా సహజ వనరులు వినియోగించుకునే మైనింగ్‌, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు తమ సీఎస్‌ఆర్‌ నిధులను ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేస్తుంటాయి. ఒకప్పుడు సింగరేణి ఇలాగే వ్యవహరించినా... గడిచిన పుష్కర కాలంగా పరిస్థితిలో మార్పు వచ్చింది.

సూర్యాపేట జిల్లాకు సింగరేణి సీఎస్‌ఆర్‌ నిధులు

గతంలో ప్రభావిత ప్రాంతాలకే ఎక్కువ మొత్తంలో సీఎస్‌ఆర్‌ నిధులను సింగరేణి కేటాయించేది. ఈ నిధులు సరిపోకపోవడంతో ‘షేప్‌’ పేరుతో ప్రత్యేక నిధులను కేటాయించి రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణానికి సాయం అందించింది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితి మారింది. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్ల వంటి ప్రాంతాలకు సీఎస్‌ఆర్‌ నిధుల కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఈ విధానాన్ని విమర్శించారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ నియోనల్‌ మెస్సీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నిర్వహించిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌కు సింగరేణి నుంచే రూ.10 కోట్లు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తాజాగా సూర్యాపేట జిల్లాకు కేటాయింపులు జరగడం గమనార్హం. సీఎస్‌ఆర్‌ కేటాయింపుల్లో ప్రభావిత ప్రాంతాలను పక్కన పెట్టడంపై జిల్లా ఎమ్మెల్యేలు మరోమారు స్పందిస్తే తప్ప ఫలితం దక్కే అవకాశాలు కానరావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement