రామ సేవా మండపంలో నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

రామ సేవా మండపంలో నిత్యకల్యాణం

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం స్వామి వారి నిత్యకల్యాణం వైభవోపేతంగా సాగింది. తెల్ల వారుజామునే గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు నిర్వహించారు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామ సేవామండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించాక నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు పూర్తిచేశారు. కాగా, రామయ్యను టీటీడీ పాలకమండలి సభ్యుడు అక్కినిముని కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆయనకు ఈఓ దామోదర్‌రావు స్వాగతం పకలగా, స్వామి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు.

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

పాల్వంచరూరల్‌: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. సెలవు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు హాజరుకాగా, అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. పలువురు భక్తులు తమ పిల్లలకు అన్నప్రాసన జరిపించగా, ఇంకొందరు ఒడి బియ్యం, పసుపుకుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓ విజయ్‌కుమార్‌, అర్చకులు, పండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

పర్యాటక ప్రాంతాల

పరిరక్షణే కీలకం

చుంచుపల్లి: పర్యాటకప్రదేశాల పరిరక్షణకు కీలకంగా భావిస్తూ భావితరాలకు అందించాలని అదనపు కలెక్టర్‌ ఎం.విద్యాచందన సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరంలోని బౌద్ధ గుహల వద్ద ఆదివారం నిర్వహించారు. జిల్లా పర్యాటక నోడల్‌ అధికారి బి.అనూష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కారుకొండ రామవరం బౌద్ధ గుహలు, చారిత్రక ప్రాధాన్యత, పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో యువత, విద్యార్థులు పాలుపంచుకోవాలని సూచించారు. అనంతరం పర్యాటకులకు భద్రత కల్పిస్తూ మార్గదర్శకత్వం చేస్తున్న టూరిజం సిబ్బందిని సత్కరించారు. వివిధ శాఖల ఉద్యోగులు, స్థానికులు పాల్గొన్నారు.

నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10–30 గంటల నుంచి ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. అలాగే, భద్రాచలంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంతో పాటు అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా గ్రీవెన్స్‌ డే జరుగుతుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్‌ ఓ ప్రకటనలో సూచించారు.

ఐటీడీఏలో గిరిజన దర్బార్‌

భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్‌ నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ తెలిపారు. అన్ని శాఖల అధికారులు, సకాలంలో హాజరుకావాలని సూచించారు. గిరిజనులు తమ సమస్యలపై లిఖితపూర్వక దరఖాస్తులు అందజేయొచ్చని తెలిపారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించినందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. ఈమేరకు వరద, ఇతర సమస్యలు ఎదురైతే ప్రజలు సమాచారం ఇచ్చేలా కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇందులో మూడు షిఫ్ట్‌లుగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి ఎదుర్కొనే ప్రజలు 08744–241950 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ ఓ ప్రకటనలో సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement