సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర ప్రధాన వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ అంకిత్ శుక్రవారం రాత్రి పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో ప్రగతి మైదానంలో వేదిక, అతిథుల గ్యాలరీ, స్టాళ్లు, డెకరేషన్, కూర్చునే ప్రదేశాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వేడుకలకు హాజరయ్యేవారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టాళ్లను పరిశీలించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించనున్న డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు విద్యా చందన, మధు, బాబూరావు, నాగలక్ష్మి, మహేందర్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈ–డిస్టిక్ మేనేజర్ సైదేశ్వరరావు, జిల్లా ప్రజావాణి సూపరింటెండెంట్ రంగు రమేష్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి ఆపరేటర్లకు ప్రజావాణి నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.
నాణ్యతలో రాజీ పడొద్దు
ఇల్లెందు/ఇల్లెందురూరల్: పట్టణంలోని జేకే ఏరియాలో చేపడుతున్న రూ. 37.50 కోట్ల ప్రభుత్వ ఏరియా 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనుల్లో రాజీ పడొద్దని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పారు. అన్ని విభాగాలను సౌకర్యవంతంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఇల్లెందులపాడు తాగునీటి చెరువు పనులను పరిశీలించి, నీటి నిల్వల్లో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కాగా, ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతీ నెల వేతనాలు అందడం లేదని టీయూసీఐ జిల్లా కార్యదర్శి యాకుబ్‌షావళీ వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత సుదిమళ్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో మౌలిక వసతుల వివరాలు తెలుసుకున్నారు. తరగతి గదులు, భోజనశాల పైకప్పులో లీకేజీలు ఉన్నాయని హెచ్‌ఎం మాధవి విన్నవించగా, మరమ్మతులు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. తహసీలార్ ఖాసీం, ఎంపీడీఓ ధన్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ సందీప్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె చంద్రశేఖర్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.


