9 ఏళ్లకు ప్రగతి శకటాలు.. | - | Sakshi
Sakshi News home page

9 ఏళ్లకు ప్రగతి శకటాలు..

Aug 15 2026 12:22 AM | Updated on Aug 15 2026 12:22 AM

● స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రభుత్వ శాఖల ప్రదర్శన ● జిల్లా ఏర్పడిన తొలి ఏడాది 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే ఏర్పాటు

● స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రభుత్వ శాఖల ప్రదర్శన ● జిల్లా ఏర్పడిన తొలి ఏడాది 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే ఏర్పాటు

చుంచుపల్లి: ఎట్టకేలకు ఈసారి పంద్రాగస్టు వేడుకల్లో ప్రగతి శకటాలు కనిపించనున్నాయి. జిల్లా ఆవిర్భావించాక తొలిసారిగా 2017, ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల్లో ప్రగతి శకటాలను ప్రదర్శించారు. ఆ తర్వాత నిధుల కొరత, ఇతర కారణాలతో ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో వీటికి స్థానం కల్పించలేదు. దీంతో ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు దృశ్యరూపంలో చూపించే అవకాశం లేకుండా పోయింది. శనివారం కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో ఆరు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రగతి శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలంకారంగా కాకుండా ప్రతీ శాఖ సాధించిన పురోగతి, అమలు చేస్తున్న పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను స్పష్టంగా చూపించేలా నమూనాలను రూపొందించారు.

ఉమ్మడి జిల్లాలో 14 శాఖల ఆధ్వర్యంలో..

జిల్లా ఏర్పడిన తర్వాత 2017లో శకటాలు ప్రదర్శించారు. ఆ తర్వాత శకటాల తయారీ, అలంకరణ, నిర్వహణకు అవసరమైన నిధుల లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ప్రదర్శన నిలిచిపోయింది. 9 ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ, వైద్యారోగ్యశాఖ, వ్యవసాయశాఖ, మాతా, శిశుసంక్షేమశాఖ, విద్యుత్‌, అగ్నిమాపక శాఖలు శకటాలను సిద్ధం చేస్తున్నాయి. ఒక్కో శకటం తయారీకి రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు, మొత్తం రూ. 7 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఉమ్మడి జిల్లాలో 14 శాఖలు శకటాలను ప్రదర్శించేవి. ఈసారి శకటాలను ప్రదర్శనకు అవకాశం ఇచ్చినా ఆరు శాఖలకే పరిమితం చేశారు. నిధుల కొరత వల్లే మిగతా శాఖలు శకటాల తయారీకి ముందుకు రానట్లు తెలుస్తోంది. అన్ని శాఖల ఆధ్వర్యంలో శకటాలు ఏర్పాటు చేస్తే బాగుండనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రగతి శకటాలను సిద్ధం చేశామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.విద్యాచందన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement