భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించా రు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సురేష్
మణుగూరు టౌన్: ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మణుగూరు మండల సమితి సింగారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరా బాద్‌లోని కొత్తపేట ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర నూ తన కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. ఉపసర్పంచుల సంఘం, వ్యవస్థాపక రాష్ట్రఅధ్యక్షుడు లావుడ్యా రాములు నాయక్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
‘ఎఫ్‌ఎఫ్‌ఎస్’ సేవలు షురూ..
టేకులపల్లి: ఎరువుల పంపిణీకి ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్ ) కొత్త యాప్ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. టేకులపల్లిలోని ఫెర్టిలైజర్ షాపుల్లో యాప్ వినియోగంపై ఇల్లెందు ఏడీఏ గుగులోత్ లాల్‌చంద్ రైతులకు అవగాహన కల్పించారు. యాప్ ద్వారా రైతులు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యూరియా, డీఏపీ, 20200 వంటి కాంప్లెక్స్ ఎరువులను సులభంగా బుక్ చేసుకోవచ్చని వివరించారు. పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్, ఏఓ అన్నపూర్ణ పీఏసీఎస్ సీఈఓ ప్రేమాచారి, వెంకటేశ్వర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
7వ దశలో ఉత్పత్తి పునరుద్ధరణ
పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో విద్యుదుత్పత్తిని శనివారం తెల్లవారుజామున అధికారులు పునరుద్ధరించారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడటంతో గురువారం రాత్రి యూనిట్ ట్రిప్ అయింది. వెంటనే మరమ్మతులు చేపట్టినట్లు సీఈ శివరామ్ రెడ్డి తెలిపారు.


