భద్రాచల రామాలయ పునరుద్ధరణలో పలు నిర్మాణాల తొలగింపు
ఎన్నో ఏళ్ల అనుబంధంతో
అర్చకులు, సిబ్బంది భావోద్వేగం
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రత్యేకం
భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. క్రమంగా ఒక్కో నిర్మాణం తొలగిస్తున్నారు. చిత్రకూట మండపం, ఉత్తర ద్వారం, అద్దాల మండపం, లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం, యాగశాల, భద్రుని గుడి, బేడా మండపం వంటి నిర్మాణాలను కూల్చివేశారు. వీటితో ఎంతో మందికి ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. ఆయా ఆలయాలు, మండపాల్లో జరిపిన సేవా కాలం, పండుగలు, ఉత్సవాలు, నిత్యకై ంకర్యాలు కళ్లముందు మెదులుతున్నాయి. అధికారులు, సిబ్బంది, అర్చకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆలయ అభివృద్ధిలో జరిగే మార్పులను స్వాగతిస్తున్నారు.
ముక్కోటి ఏకాదశి రోజు జరిగే ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాను. వీటికి వేదికగా ఉన్న ఉత్తర ద్వారంతో పాటు ఇతర నిర్మాణాలు ఒక్కోటి దూరమవుతున్న క్షణాలు మనస్సును కలిచివేస్తున్నాయి. ఇక్కడి ఉత్సవాలు, పూజలలో పాల్గొన్న క్షణాలు అనిర్వచనీయం.
–అమరవాది విజయరాఘవన్, ప్రధాన అర్చకుడు


