నవభారత్ సేవలు అమూల్యమైనవి
పాల్వంచ: విద్యాభివృద్ధికి నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న సహకారం అమూల్యమైనదని డీఈఓ, జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. మంగళవారం స్థానిక నవభారత్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్వంచ, బూర్గంపాడు, టేకులపల్లి, మణుగూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు 250 డెస్క్ బల్లాలను వితరణగా అందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల చదువు కోసం సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. సంస్థ అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం జీఎం (సీఎస్‌ఆర్) ఎంజీఎం ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలకు 4,500 బల్లాలను అందించామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరామ్మూర్తి, నవభారత్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్‌వీకే ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు పి.జ్యోతి, రాజేశ్వరరావు,రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడావిద్యార్థుల అవస్థలు
పాల్వంచరూరల్: మండలంలోని లక్ష్మీదేవిపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర కళాశాలలో మంగళవారం డీఈఓ పర్యవేక్షణలో పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు భద్రాచలం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, దమ్మపేట ఆరుజోన్ల నుంచి సుమారు 450 మంది విద్యార్థులు హాజరై ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. అయితే, క్రీడలు నిర్వహించిన మైదానం వద్ద విద్యార్థులకు నీడ లేకపోవడంతోపాటు తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయకపోవడంతో నానా అవస్థలు పడ్డారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
గుండాల: జిల్లాస్థాయి వాలీబాల్, ఖో–ఖో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సురేశ్ తెలిపారు. మంగళవారం పాల్వంచలో జరిగిన జిల్లాస్థాయి క్రీడల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని, వాలీబాల్, ఖో–ఖో క్రీడల్లో ప్రథమస్థానం, షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. విజేతలకు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పతకాలు అందించారని చెప్పారు.
‘పర్షియన్ వానిషర్’ నవల ఆవిష్కరణ
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని వసుంధర – సుమంగళి అధినేత తాటిపల్లి శంకర్‌బాబు మనవరాలు అవ్యక్త గెల్లా రచించిన ‘పర్షియన్ వానిషర్’నవలను మంగళవారం కొత్తగూడెంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాసగుప్తా మాట్లాడుతూ.. అవ్యక్త గెల్లా 13 ఏళ్ల వయస్సులోనే నవల రచించడం అభినందనీయమన్నారు. అనంతరం పాటల రూపంలో నవల సారాంశాన్ని వివరించడం ఆకట్టుకుంది. కార్యక్రమంలో దోపాటి వెంకటేశ్వరరావు, కోనేరు పూర్ణచందర్‌రావు, సాబీర్‌పాషా, రంగాకిరణ్, నాగా సీతారాములు, ఆళ్ల మురళి, తూము చౌదరి, కొదుమూరి శ్రీనివాస్, నాగేంద్రత్రివేది, అబ్దుల్ భాసిత్ పాల్గొన్నారు.
వ్యక్తి అదృశ్యం
అశ్వారావుపేటరూరల్: ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ యాయతి రాజు కథనం ప్రకారం.. పట్టణంలోని పాత పేరాయిగూడేనికి చెందిన చిప్పనపల్లి రవీంద్ర కొద్దిరోజులుగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నెల 28వ తేదీన అతిగా మద్యం సేవించి గొడపడి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని భార్య నాగేశ్వరి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నవభారత్ సేవలు అమూల్యమైనవి
నవభారత్ సేవలు అమూల్యమైనవి
నవభారత్ సేవలు అమూల్యమైనవి


