క్రీడోత్సవాలకు రండి
ముఖ్యమంత్రిని ఆహ్వానించిన
ఎమ్మెల్యే పాయం
పినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో జనవరి 7 నుంచి జరిగే జాతీయస్థాయి అండర్ –17 బాలుర కబడ్డీ పోటీలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎన్నారై కంది విశ్వభారతి రెడ్డితో కలిసి సీఎం వద్దకు వెళ్లారు. మారుమూలన ఉన్న ఏడూళ్లబయ్యారంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
7న ఉమ్మడి జిల్లాలో
కేటీఆర్ పర్యటన
ఖమ్మంవైరారోడ్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేనెల 7న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు జరిగే సన్మాన కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం చేరుకోనున్న కేటీఆర్ అక్కడ సన్మానంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఖమ్మం వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యులు సహా పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఎంపీ ఓ ప్రకటనలో కోరారు.
వన్యప్రాణులను
వేటాడితే చర్యలు తప్పవు
డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్
గుండాల : వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్ హెచ్చరించారు. మండల పరిధిలోని అడవులు, ప్లాంటేషన్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల్లో పెంచుతున్న ప్లాంటేషన్ల్‌పై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని రకాల మొక్కలకు ఎప్పటికప్పుడు నీరందిస్తూ కాపాడాలని సూచించారు. కొత్తగా పోడు నరికేవారిపై చర్యలు తీసుకోవాలని, అడవులపై అవగాహన కల్పించాలని అన్నారు. కొత్త ప్లాంటేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్‌డీఓ కరుణాకరాచారి, రేంజర్ నర్సింహా రావు తదితరులు ఉన్నారు.
ఇండోర్ స్టేడియాన్ని వినియోగించుకోండి
దుమ్ముగూడెం : మండలంలోని ములకపాడులో రూ.2.26 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. మంగళవారం ఆయన స్టేడియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలను ఉపయోగించుకుని యువత క్రీడల్లో రాణించాలని అన్నారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ఐటీడీఏ డీఈ హరీష్‌కు సూచించారు. అంతకుముందు పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఎస్పీ దర్శించుకున్నారు. పంచవటీ కుటీరాన్ని సందర్శించి ప్రాశస్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ వెంకటప్పయ్య, ఎస్‌ఐలు గణేష్, రాజశేఖర్ ఉన్నారు.
క్రీడోత్సవాలకు రండి
క్రీడోత్సవాలకు రండి


