భూలోక వైకుంఠమే.. | - | Sakshi
Sakshi News home page

భూలోక వైకుంఠమే..

Dec 31 2025 7:14 AM | Updated on Dec 31 2025 7:14 AM

భూలోక

భూలోక వైకుంఠమే..

తిరువీధి సేవకు స్వల్ప ఆలస్యం

ఆధ్యాత్మికత చాటిన ‘ముక్కోటి’ వేడుకలు

రామయ్య దర్శనంతో పులకించిన భక్తులు

ముక్కోటి ఏకాదశి వేళ భద్రగిరి భూలోక వైకుంఠంగా మారింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, ధూపదీపాల నడుమ జయ గంటలు మోగుతుండగా మంగళవారం తెల్ల వారుజామున ఉత్తర ద్వార దర్శన వేడుక ఆద్యంతం నేత్ర పర్వంగా సాగింది. రామచంద్రమూర్తి గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్‌ వాహనంపై ఉత్తర ద్వారం వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే ప్రారంభమైన ఈ వేడుకలు ఉదయం 6 గంటలకు ముగిశాయి. 5 గంటల సమయాన ఉత్తర ద్వారాలు తెరుచుకోగా, ధూపదీపాలు, హారతి వెలుగుల నడుమ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు.

– భద్రాచలం

స్వామివారికి ప్రత్యేక పూజలు..

ఉత్తర ద్వార దర్శనానికి ముందు శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సంప్రదాయం ప్రకారం సుప్రభాత సేవ, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారు వెండి గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలోకి ప్రవేశించారు. తొలుత దేవస్థాన హరిదాసులు శ్రీరామ కీర్తనలు ఆలపించారు. అనంతరం స్థానాచార్యులు కేఈ స్థలశాయి వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. ఈ ఏకాదశి రోజున వైకుంఠంలో స్వామి వారిని ముక్కోటి దేవతలు దర్శించుకుంటారని, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శిస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం సిద్ధిస్తుందని చెప్పారు.

మార్మోగిన రామనామం..

సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలకు మంగళ వాయిద్య గంట మోగుతుండగా ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. వైకుంఠాన్ని మైమరిపించేలా ప్రత్యేకంగా అలంకరించిన ఈ ద్వారంలో ధూప, దీపాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులు భక్తులకు దర్శనమిచ్చారు. గంట పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా, ‘శ్రీ రామాయనమః’ అంటూ భక్తుల రామనామ స్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆ తర్వాత చుతర్వేద పారాయణం చేసి, నివేదన, మంత్రపుష్పం సమర్పించారు. చివరగా 108 వత్తులతో కూడిన హారతి సమర్పించాక శరణాగతి, దండకం అనంతర ం ఉత్తర ద్వార దర్శన ప్రాశస్త్యాన్ని అర్చకులు వివరించారు.

వైభవంగా తిరువీధి సేవ

ఉత్తర ద్వార దర్శనానంతరం శ్రీసీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య తిరువీధి సేవకు బయలుదేరారు. గరుడ వాహనంపై స్వామి వారు, గజ వాహనంపై సీతమ్మవారు, హనమత్‌ వాహనంపై లక్ష్మణస్వామిని కొలువుదీర్చి రాజవీధి మీదుగా తాతగుడి వరకు తిరువీధి సేవ నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామివారి వెంట నడువగా గోవిందరాజ స్వామివారి ఆలయం వరకు వెళ్లిన స్వామి వారు ప్రత్యేక పూజల అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్‌, పాయం వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌, ఉత్సవాల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, సబ్‌కలెక్టర్‌ మ్రిణాల్‌శ్రేష్ట, ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ సౌరబ్‌ శర్మ, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఎస్పీ రోహిత్‌రాజ్‌, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, ఆలయ ఈఓ దామోదర్‌రావు, భద్రాచలం సర్పంచ్‌ పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తగ్గిన వీవీఐపీల రాక

భద్రాచలంలో జరిగిన తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు ఈ ఏడాది వీవీఐపీల రాక తగ్గింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మంత్రులు ఉత్సవాలకు హాజరు కాలేకపోయారని అధికారులు భావిస్తున్నారు. మంత్రుల సతీమణులు సైతం ఉత్సవాలకు రాలేదు. ఎట్టకేలకు ఉత్సవాలు విజయవంతం కావడంతో జిల్లా ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వార దర్శనం అనంతరం నిర్వహించే తిరువీధి సేవకు స్వల్ప ఆలస్యం జరిగింది. స్వామి వారి వాహనాలు మోసే బోయీలు అందుబాటులో లేకపోవడంతో పలుమార్లు మైక్‌లో అనౌన్స్‌ చేశారు. కాగా సెక్టార్లన్నీ నిండిపోవడంతో బోయిలు దూరంగా వెళ్లాల్సి రావడంతో సుమారు 15 నిమిషాల పాటు జాప్యం జరిగింది. ఇక వీవీఐపీ, మీడియా సెక్టార్లలో అనుమతి లేకుండా అనేక మంది రావడంతో అవన్నీ ముందుగానే నిండిపోయాయి.

భద్రగిరిలో నేత్రపర్వంగా ఉత్తర ద్వార దర్శనం

భూలోక వైకుంఠమే..1
1/1

భూలోక వైకుంఠమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement