లక్ష్యాన్ని సాధించడమే అసలైన విజయం
● కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ● ముగిసిన పీఎంశ్రీ జిల్లా స్థాయి పోటీలు
పాల్వంచరూరల్: చదువు, ఆటల్లో గెలుపోటములు వస్తాయని.. ఇవన్నీ దాటుకుంటూ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడమే అసలైన విజయమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో మంగళవారం జిల్లా స్థాయి పీఎంశ్రీ పాఠశాలల క్రీడా పోటీలు నిర్వహించగా డీఈఓ బి.నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ పోటీలకు ఆరు జోన్ల నుంచి 450 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరై కబడ్డీ, ఖో–ఖో, అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీల్లో తలపడ్డారు. ఈ మేరకు సాయంత్రం నిర్వహించిన ముగింపు సమావేశంలో విజేతలకు బహుమతులు అందజేశాక కలెక్టర్ మాట్లాడారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, ఎంఈఓలు శ్రీరామ్మూర్తి, ఆనందకుమార్, జిల్లా సైన్స్ అధికారి సంపత్‌కుమార్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నరేష్‌కుమార్, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన 76 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని, ఇందులో 43 మంది బాలురు, 33మంది బాలికలు ఉన్నారని డీఈఓ నాగలక్ష్మి వెల్లడించారు.
విజేతలు వీరే..
వాలీబాల్ బాలుర విభాగంలో గుండాల టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, పాల్వంచ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల, బాలికల విభాగంలో కే.రేగుబల్లి ఆశ్రమ పాఠశాల, ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల జట్లు మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. కబడ్డీ బాలుర విభాగంలో అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకులం, దమ్మపేట టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, బాలికల విభాగంలో సుదిమళ్ల టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, కే.రేగుబల్లి ఆశ్రమ పాఠశాల జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఖోఖో బాలుర విభాగంలో గుండాల టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకులం, బాలికల విభాగంలో కే.రేగుబల్లి ఆశ్రమ పాఠశాల, సుదిమళ్ల టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, ఫుట్‌బాల్ బాలుర విభాగంలో పాల్వంచ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం, దమ్మపేట టీడబ్ల్యూఆర్‌ఎస్ జట్లు మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఇక అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగు పందెంలో బి.అభిలాష్, కె.శ్రీకాంత్, బాలికల్లో పి.దీవెన, పి.నాగరాణి, లాంగ్‌జంప్ బాలురలో కె.శ్రీకాంత్, సాయిచరణ్, బాలికల్లో జె.శ్రీవైష్ణవి, పి.దీవెన, షాట్‌ఫుట్ బాలుర విభాగంలో వి.రాహుల్, జి.రాహుల్‌తేజ్, బాలికల్లో జె.పూజిత, బి.సుభద్ర మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. కాగా, విద్యార్థులకు హాల్‌లో కూర్చోబెట్టి కాకుండా క్యూలో నిల్చోబెట్టి భోజనాలు వడ్డించడంతో కొంత ఇబ్బంది పడ్డారు.
లక్ష్యాన్ని సాధించడమే అసలైన విజయం


