యూరియా కొరత లేదు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ కు యూరియా, ఎరువుల కొరత లేదని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగి పంటల సాగును దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో యూరియా సరఫరాకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో మొక్కజొన్న, వరి ప్రధానంగా సాగు చేస్తున్నారని, జిల్లాలో ఇప్పటివరకు మొక్కజొన్న 38,500, వరి 8,750 ఎకరాల్లో సాగైందని వెల్లడించారు. వరినాట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాకు 28,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 8,750 మెట్రిక్ టన్నులు సరఫరా అయిందని, జిల్లాలోని గోదాంల్లో ఇంకా 1,35,800 బస్తాల యూరియా నిల్వలు ఉన్నాయని, అదనంగా 1,51,200 బస్తాలు త్వరలో చేరకుంటాయని వివరించారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దని సూచించారు. పీఏసీఎస్‌ల ద్వారా నిరంతరం సరఫరా చేస్తామని, రైతులు అవసరానికి మించి యూరియా ముందుగా కొనుగోలు చేయొద్దని కోరారు. యూరియా పంపిణీలో అక్రమాలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు
మణుగూరు రూరల్: జిల్లాలో ఎరువుల కొరత లేదని డీఏఓ వి.బాబూరావు తెలిపారు. మంగళవారం ఆయన మణుగూరులో మాట్లాడుతూ.. 35 పీఏసీఎస్‌లు, 10 ఏఆర్‌ఎస్‌కే సెంటర్లు, ఒక డీసీఎంఎస్ పాయింట్, 364 ప్రైవేట్ దుకాణాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని వివరించారు. వరి, మొక్కజొన్న సాగు చేసే రైతులకు ఎకరానికి ఒక బ్యాగు చొప్పున అందిస్తామని చెప్పారు. ఎరువుల కోసం క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో యాప్ ద్వారా ఎరువులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎరువుల కొరత లేకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఎరువుల పంపిణీలో అలసత్వం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత సిబ్బందిని హెచ్చరించారు. సమావేశంలో మణుగూరు ఏఓ రాహుల్‌రెడ్డి, ఏఈఓ కొమరం లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్


