యాసంగిలోనూ తప్పని తిప్పలు
జూలూరుపాడు: వానాకాలం సీజన్‌లో యూరియా కోసం ఇబ్బంది పడిన రైతులకు యాసంగిలోనూ కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం మొక్కజొన్న, వరి సాగు చేస్తుండగా అవసరమైన యూరియా కోసం గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలూరుపాడు సహకార సంఘం కార్యాలయం వద్ద మంగళవారం బారులుదీరిన రైతులు.. ఎన్ని ఎకరాల్లో సాగు చేసినా ఒక్కొక్కరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని, వాటి కోసం ఎంతో సేపు వేచి ఉండాల్సి వస్తోందని అంటున్నారు. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్‌తో రెండు, మూడు రోజులుగా పీఏసీఎస్ చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు. పంటలకు సరిపడా ఇవ్వకుండా రెండు బస్తాలు ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సరిపడా ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా, పీఏఎసీఎస్ కార్యాలయంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని జూలూరుపాడు ఏఓ దీపక్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా అవసరమైన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ అందించి నిర్ణీత ధర ప్రకారం తీసుకోవచ్చని పేర్కొన్నారు. యాప్ ఇంకా అందుబాటులోకి రాలేదని, ప్రస్తుతం పాత విధానంలోనే విక్రయిస్తున్నామని వెల్ల డించారు. ఎరువుల దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉంటే రైతులు కొనుగోలు చేయవచ్చని సూచించారు.


