మిస్ టీన్ ఇండియా ప్రీతికి సత్కారం
భద్రాచలంటౌన్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇటీవల నిర్వహించిన ‘ఫరెవర్ స్టార్ ఇండియా సీజన్–5’పోటీల్లో మిస్ టీన్ ఇండియా 2025 (తెలంగాణ విజేత)గా నిలిచిన భద్రాచలం వాసి ప్రీతియాదవ్‌ను బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, కోటగిరి ప్రబోధ్‌కుమార్, దానేశ్వరరావు, రేపాక పూర్ణచంద్రరావు, అకోజు సునీల్, అయినవోలు రామకృష్ణ, అజీమ్, కావూరి గోపి, మోహన్‌రావు, కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, తెల్లం రాణి పాల్గొన్నారు.
బైక్‌ను ఢీకొట్టిన కారు..
అశ్వాపురం: మండలంలోని గోపాలపురం నుంచి కల్యాణపురం వరకు మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బైక్‌లను ఢీకొట్టి వేగంగా కార్లు ఆపకుండా వెళ్లిపోతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మిట్టగూడెం గ్రామానికి చెందిన భారజల కర్మాగారం ఉద్యోగి గుండ్రెడ్డి రామిరెడ్డి బైక్‌పై భారజల కర్మాగారం విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా అశ్వాపురం నుంచి మణుగూరు వైపు వెళ్తున్న కారు అతివేగంగా బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. రామిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108లో అశ్వాపురం పీహెచ్‌సీకి తరలించారు. పలుమార్లు కార్లు బైక్‌లను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిన ఘటనలు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం, మిట్టగూడెం క్రాస్‌రోడ్డు, కల్యాణపురంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దుమ్ముగూడెం: మండలంలోని చిన్నఆర్లగూడెం శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజుపేటకు చెందిన తుర్స నరసింహారావు (18) మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. తుర్స నరసింహారావు, తుర్స జంపన్న కలిసి ద్విచక్రవాహనంపై లక్ష్మీనగరం గ్రామానికి గ్యాస్ సిలిండర్ కోసం వచ్చారు. కాగ గ్యాస్ దొరక్క పోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా చిన్నఆర్లగూడెం శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందగా.. జంపన్నకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగావకాశాలు
ఖమ్మం రాపర్తినగర్: నర్సింగ్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్), కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యాన జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధికల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగాలు కల్పన ప్రక్రియ చేపడుతారని వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం పూర్తి చేసి 1–3 ఏళ్ల ఆనుభవం ఉండడంతో పాటు 22నుంచి 38 ఏళ్ల వయస్సు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం 94400 51581 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
మిస్ టీన్ ఇండియా ప్రీతికి సత్కారం


