సంక్షేమమే లక్ష్యంగా పాలన
● ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ● తొమ్మిది నెలల్లో సమీకృత భవన నిర్మాణాలు పూర్తి ● రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
ఖమ్మంరూరల్: పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృధ్ధి పనుల నిర్వహణలోనూ వెనక్కు తగ్గకుండా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తరుణి హాట్‌లో నిర్మిచనున్న రూరల్ మండల కార్యాలయాల సమీకృత భవన నిర్మాణ పనులకు శనివారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఖమ్మం రూరల్ మండలంలో సమీకృత కార్యాలయాల నిర్మాణానికి రూ. 45 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు ఏదులాపురం మున్సిపాలిటీ, రూరల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.221 కోట్లతో పలు పనులు చేపట్టామని వివరించారు. అవసరమైన రోడ్లు, డ్రెయిన్‌లు, తాగునీటి సరఫరా, ఇతర పనులు పూర్తి చేస్తామని, ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్దిదిద్దుతామని హామీ ఇచ్చారు. సమీకృత కార్యాలయ భవనాలను తొమ్మిది నెలల్లో అందుబాటులోకి తేవాలని అధికా రులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండడంతో ప్రజలకు సుపరిపాలన అందుతుందని అన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. రూరల్ మండలానికి సంబంధించి 13 శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం 129 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ భైరు హరినాథ్‌బాబు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ నర్సింహారావు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకో బు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, నాయకులు చినవెంకటరెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.


