వ్యర్థంతోనూ అద్భుతమైన కళాకృతులు..
ఇల్లెందురూరల్:అవగాహన పెంపొందించుకొని అందుకు అనుగుణంగా సాధన చేస్తే వ్యర్థాలతోనూ అద్భుతమైన కళాకృతులను సృష్టించవచ్చని ఎన్‌జీసీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ నాగరాజుశేఖర్ అన్నారు. మండలంలోని రొంపేడు ఆశ్రమ పాఠశాలలో శనివారం వేస్ట్ టు వెల్త్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇల్లెందు, గుండాల మండలాల పరిధిలోని పలు ప్రభుత్వ, గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులు వ్యర్థాలతో తయారు చేసిన కళాకృతులను వేడకలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. పలు విభాగాల అధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రదర్శనను తిలకించి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ఈనేపథ్యాన రొంపేడు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రథమ, కొమరారం ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ, ఇల్లెందు మార్గదర్శిని పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలవగా.. వీరికి కో–ఆర్డినేటర్‌తో పాటు ఎంపీడీఓ ధన్‌సింగ్, ఎంఈఓ ఉమాశంకర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన చుట్టూ ఉండే వనరులపై అవగాహన పెంచుకుని ప్రతీ వ్యర్థాన్ని వినియోగంగా తీర్చిదద్దాలన్న ఆకాంక్షను బలపర్చుకోవాలని, అందుకు అనుగుణంగా పలు కళాకృతులకు రూపకల్పన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొమ్ముగూడెం సర్పంచ్ తాటి యశోద, ఏసీఎందో రమేష్‌బాబు, డీఎస్‌ఓ సంపత్, చలపతిరావు, రొంపేడు ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం పద్మ, వార్డెన్ భీమా, పార్వతి తదితరులు పాల్గొన్నారు.


