నేరాలు తగ్గినా.. మరణాలు పెరిగాయి
గంజాయిపై ఉక్కుపాదం
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు
సీ్త్రలు, బలహీనవర్గాలపై దాడులు
అరికట్టడంలో వెనుకంజ
2025 వార్షిక నివేదికలో
వివరాల వెల్లడి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జిల్లాలో నేరాల తీవ్రత స్వల్పంగా తగ్గింది. వరకట్న మరణాలు, పోక్సో, బలహీన, అణగారినవర్గాలపై దాడులు వంటి కేసులు పెరిగాయి. ఓవరాల్‌గా రోడ్డు ప్రమాదాలు తగ్గినా, ఆ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య పెరిగింది. 2025కి సంబంధించిన వార్షిక నివేదికను ఎస్పీ బి.రోహిత్‌రాజు శనివారం కొత్తగూడెంలో వెల్లడించారు. ఈ ఏడాది జిల్లాలో 326 మంది మావోయిస్టులు లొంగిపోయారని, నలుగురు అరెస్టయ్యారని తెలిపారు. రాబోయే రోజుల్లో గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టడంతో పాటు పోక్సో చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యాశాఖతో కలిసి పని చేస్తామన్నారు. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. 2025 వార్షిక నివేదికలో ఇతర అంశాలు ఇలా ఉన్నాయి.
ఏడుగురికి జీవిత ఖైదు
జిల్లా వ్యాప్తంగా 3,559 కేసులు నమోదయ్యాయి. ఇందులో పోలీసుల సమర్థవంతమైన విచారణ ఫలితంగా 51.47 శాతం అంటే 1,827 కేసుల్లో నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. ఇందులో జీవితఖైదు పడిన కేసులు 7, ఇరవై ఏళ్ల జైలుశిక్ష పడిన కేసులు రెండు, పదేళ్లు పడిన కేసులు 5, ఏడేళ్లు శిక్ష పడిన కేసులు 3, ఐదేళ్ల శిక్ష పడిన కేసులు 38, ఏడాదిలోగా శిక్ష పడిన కేసులు 79 ఉన్నాయి. లోక్ అదాలత్‌లో 2,656 కేసులు పరిష్కారమయ్యాయి.
23 మందిపై రౌడీషీట్
జిల్లా వ్యాప్తంగా 153 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఇందులో 23 మందిపై ఈ ఏడాది కొత్తగా రౌడీషీట్ నమోదైంది. 98 మంది అనుమానితుల జాబితాలో ఈ ఏడాది చేరారు. దొంగతనాలకు సంబంధించి 146 కేసులు నమోదు కాగా, 332 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో డెకాయిట్ 1, రాబరీ 2, అతిక్రమణలు 62, చోరీ కేసులు 82 ఉన్నాయి. రూ.1.21 కోట్ల విలువైన ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న ప్రాపర్టీలో ఇది 46 శాతంగా ఉంది.
సైబర్ క్రైం
సైబర్ క్రైం విభాగంలో జిల్లా వ్యాప్తంగా 1,613 ఫిర్యాదులు అందాయి. ఇందులో 196 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మోసగాళ్ల ఖాతాలోకి వెళ్లిన రూ.1.45 కోట్ల నగదును సీజ్ చేశారు. రూ.22.63 లక్షల నగదును రికవరీ చేశారు. ఇసుక, రేషన్ బియ్యం, పశువుల అక్రమ రవాణా నిరోధంలోనూ గణనీయమైన పురోగతి సాధించారు.
గంజాయి అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. గడిచిన ఏడాదిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 70 కేసులు నమోదు అవగా, రూ.28.53 కోట్ల విలువ చేసే 5,707 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఇందులో నిబంధనలను అనుసరిస్తూ రూ.17,37 కోట్ల విలువైన 4,359 కేజీల గంజాయిని నాశనం చేశారు. గంజాయి కేసులకు సంబంధించి 221 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన వారు 152 మంది ఉండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 69 మంది ఉన్నారు. టేకులపల్లి, భద్రాచలానికి చెందిన ఇద్దరు నిందితులకు పదేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. ముగ్గురి మీద పీడీ యాక్ట్ పెట్టారు. గంజాయి సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈమేరకు కొత్తగా 69 మందిని అనుమానితుల జాబితాలో చేర్చారు. మొత్తంగా జిల్లాలో గంజాయికి సంబందించి 324 మంది అనుమానితులు జాబితాలో ఉన్నారు.
నేరాలు తగ్గినా.. మరణాలు పెరిగాయి


